‘కరువు’ పనుల్లో కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

‘కరువు’ పనుల్లో కష్టాలు!

Mar 15 2026 4:48 AM | Updated on Mar 15 2026 4:48 AM

నల్లబెల్లి: గ్రామాల్లో వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పథకంలో అక్రమాలను నివారించేందుకు నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. కానీ, కూలీలకు పని ప్రదేశంలో వసతులు కల్పించడంలో మాత్రం విస్మరిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేక పనులు అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. పూట గడవాలంటే ఉపాధి పనులకు వెళ్లక తప్పడం లేదని, అసౌకర్యాల నడుమ ఇబ్బందులు పడుతూ పనులు చేస్తున్నామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం చెరువుల్లో గుంతలు, పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి.

కానరాని ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు

ఎండలు దంచికొడుతుండడంతో ఉపాధి కూలీలు బిక్కుబిక్కుమంటూ పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ, తాగునీరు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నా అవి ఏమి కానరావడంలేదు. పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే ప్రథమ చికిత్స అందించడానికి ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు సైతం అందుబాటులో లేవు. వసతులు లేకపోవడంతో చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు కూలీలు మొగ్గు చూపడం లేదు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

వేసవి కాలం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండవేడిలో గంటల తరబడి పనులు చేస్తున్న కూలీలు కొంత సమయం సేద తీరేందుకు పని ప్రదేశాలోల నీడ ఉండడం లేదు. నీడ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అధికారులు, సిబ్బంది అటువైపుగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీడ కోసం 8 సంవత్సరాల క్రితం పరదాలు అందించిన ప్రభుత్వం తిరిగి పరదాలు అందజేసిన దాఖలాలు లేవు. గతంలో అందించిన పరదాలు ఎప్పుడో చినిగిపోయాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధి హామీ పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీ నాగెల్లి సామ్యేల్‌. ఉపాధి పనులు చేసేందుకు వచ్చిన కూలీలు భోజనం చేసి సేద తీరేందుకు అధికారులు నీడ ఏర్పాటు చేయలేదు. దీంతో చేసేదేమిలేక మండుటెండలో మొట్టుపై కూర్చుండి అన్నం తిన్నాడు. అధికారులు పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇది కేవలం ఒక్క సామ్యేల్‌ దుస్థితే కాదు.. జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చాలాచోట్ల కూలీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఎండలో విలవిలాడుతున్న ఉపాధి హామీ కూలీలు

మౌలిక వసతులు కల్పించడంలో అధికారుల నిరక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement