పర్వతగిరి: విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం పర్వతగిరి మండలంలోని ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, భోజనశాల, వంట గది, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. వంటగది, తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ సంధ్యారాణి, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శారదను సస్పెండ్ చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత డీసీఓను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక అమలు నిర్లక్ష్యం వహించడం, విద్యార్థుల విద్యా కార్యకలాపాలపై పర్యవేక్షణ లేకపోవడంపై పీఓ అపర్ణ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రేవతి, బీజీఎన్‌ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను పరిశీలించి విద్యార్థుల ఫిర్యాదులను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, తదితరులు ఉన్నారు.
పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: విద్యార్థులు పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం విడుదల చేసిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీవైడబ్ల్యూఓ అనిల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
సిలిండర్ కొరత లేదు..
జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్‌ల సరఫరాలో కొరత లేదని కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొంత మంది వినియోగదారులు సిలిండర్ల కొరత వచ్చే అవకాశం ఉందని భావించి ముందుగానే ఎల్పీజీ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారన్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనన్నారు.
కలెక్టర్ సత్యశారద
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ


