నెక్కొండ: గ్రామ పంచాయతీ వర్కర్లు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మల్టీపర్సస్ వర్కర్ విధానంతో కార్మికులు, సిబ్బంది ఒత్తిడి గురవుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం జీఓ నంబర్ 51ను సవరించి మల్టీపర్సస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, గతంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలను అమలు చేయాలని పేర్కొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు, మేర్గు మధార్, నాయకులు కనకం కష్ణ, గుజ్జునూరి రాజు, ఈదునూరి వెంకటేష్, మహేశ్, బాబు, వెంకన్న, నాగేశ్, సబిత, రామనర్సమ్మ, స్వరూప, కళావతి, తదితరులు పాల్గొన్నారు.


