తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఎల్కతుర్తి/భీమదేవరపల్లి: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తి మండల కేంద్రం, భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌ రైతువేదికల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండలస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుంచి జూన్‌ 12 వరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతీ గ్రామంలో పరిశరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌, వైద్య ఆరోగ్యశాఖ వైద్య పరీక్షలు, కాకతీయ వైద్యకళాశాల వైద్యశిబిరాలు, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్టు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి గృహప్రవేశాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖ అధికారులు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. యువజన, క్రీడల శాఖ అధికారులు క్రీడలు నిర్వహించాలని, పర్యావరణ, అటవీ శాఖ అధికారులు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు చేపట్టాలని, వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీలను సిద్ధం చేయాలని కోరారు. గ్రామాల్లో తాగునీటి వనరులు పరిశీలించి అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎల్కతుర్తి జెండర్‌ రిసోర్స్‌ భవనాన్ని ప్రారంభించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. సమీక్షల్లో అదనపు కలెక్టర్‌ రవి, డీఆర్‌డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఎంపీడీఓలు విజయ్‌కుమార్‌, వీరేశం, భీమదేవరపల్లి తహసీల్దార్‌ రాజేశ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుకినె సంతాజీ, సర్పంచ్‌లు మునిగడుప లావణ్య, అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement