న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డికి సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. సాధ్యమైనంతవరకు అక్కడికక్కడే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యలుంటే అందుకుగల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌కు 113 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 46, జీడబ్ల్యూఎంసీకి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 46 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్‌డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పట్టాపాసు పుస్తకాలు లేక ఇబ్బందులు
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్‌కు చెందిన రైతులం మేము. మా భూములకు రికార్డులు, పట్టాలు లేవు. మేము.. మా తల్లిదండ్రులు, తాతల కాలం నుంచి వ్యవసాయ భూములను సాగుచేసుకుంటున్నాం. చాలా మట్టుకు సాదా కాగితాలతో కొనుగోలు చేసిన భూములే. గ్రామంలోని 80శాతం రైతులకు పట్టాపాసు పుస్తకాలు లేవు. వారసులకు బదిలీ (విరాసత్) చేయాలంటే, పట్టాలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మాకు న్యాయం చేయండి. – గొర్రెకుంట గ్రామ రైతులు
ఖైదీగా శిక్ష అనుభవిస్తూ నా భర్త చనిపోయాడు
నా భర్త మనుపాటి జంపయ్య. ఓ కేసులో వరంగల్ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురై 1996లో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. నా భర్త లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నాకు ముగ్గురు కూతుర్తెలు కాగా, అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నన్ను పోషించేవారు లేరు. అప్పట్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం జరగలేదు. నాకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి, ఆర్థిక సాయం అందించాలి.
– మనుపాటి సారమ్మ, కాశిబుగ్గ
బెల్డ్, గుడుంబా స్థావరాలు తొలగించండి
పర్వతగిరి మండలంలోని గోరుగట్టు తండాలో బెల్ట్‌షాపులు, గుడుంబా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. మద్యం అలవాటుతో గ్రామంలోని యువకులు మత్తుకు బానిసై జీవితాలు నాళనం చేసుకుంటున్నారు. దాంతో తాము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు. మద్యం వ్యసనపరులు రోడ్లపైనే తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే ఆ షాపులను తొలగించి మహిళలకు రక్షణ కల్పించాలి.
– గోరుగట్టు తండా (పర్వతగిరి) మహిళలు
ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణికి 113 దరఖాస్తులు
మామునూరును మండల కేంద్రం చేయాలి
మామునూరును మండల కేంద్రంగా ప్రకటించాలని మామునూరు మండల సాధన కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కోరారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బొల్లికుంట, నక్కలపల్లి, గాడెపల్లి, గుంటూరుపల్లి, తిమ్మాపూర్, అల్లీపురం, మూమునూర్, సింగారం, కమ్మరపల్లి, కేసీఆర్ నగర్, జాన్సీనగర్, లక్ష్మిపురం, పెన్షన్‌పూర్, బెస్తంచెరు, జక్కలొద్ది, సత్యసాయినగర్, లెనిన్‌నగర్, సాయినగర్, రాంగోపాల్‌పూర్ తదితర గ్రామాలను కలుపుతూ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1932లో 19వందల ఎకరాల వ్యవసాయ సాగుభూమిని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మామునూరు రైతులు అప్పగించినట్లు గుర్తుచేశారు.


