పంచాయతీలకు ఊరట
చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు.. పెద్ద వాటికి రూ.10 లక్షలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1,682 గ్రామ పంచాయతీలు.. వరంగల్ జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 317 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా చిన్న పంచాయతీలే. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా జీపీలకు స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలకు సుమారు రూ.వంద కోట్ల వరకు అభివృద్ధి నిధులు సమకూరే అవకాశాలు ఉన్నాయి.
ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ
● సర్పంచ్‌ల్లో నూతనోత్సాహం
● జిల్లాలో 11 గ్రామీణ మండలాలు.. 317 జీపీలు
వరంగల్: ప్రత్యేకాధికారుల పాలనలో నిధులు లేక రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలు నీరసించాయి. దీంతో పల్లెల్లో పాలన గాడితప్పింది. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుకగా సర్పంచ్‌లకు తీపి కబురు చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్‌మెంట్) కింద పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిధులు ఇస్తామని ప్రకటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కీలకం..
పంచాయతీలు అభివృద్ధి బాటలో నడవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులే కీలకం. ఇవి కూడా జనాభా ప్రాతిపదికన విడుదలవుతాయి. పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. నిధులు రాక పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులతో అత్యవసర పనులు చేయించారు. బిల్లులు రాక గత పాలకులు తెచ్చిన అప్పులకు ఇంకా వడ్డీలు చెల్లిస్తున్నారు. బిల్లుల మంజూరు కోసం జీపీలతోపాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యేక నిధులు విడుదలైతేనే వారికి డబ్బులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు పంచాయతీల ఖజానాల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వారి ఆనందం ఆవిరైపోయింది. రోజూ వారి పారిశుద్ధ్య పనులు, కార్మికుల జీతాలు, ట్రాక్టర్లలో డీజిల్, మరమ్మతులను కొంతమంది సొంత డబ్బులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖజానాలు ఖాళీ..
జిల్లాలోని కొన్ని పెద్ద పంచాయతీలు మినహా మిగిలిన పంచాయతీల ఖజానాలు మొత్తం ఖాళీగా ఉన్నట్లు సమాచారం. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పైపులైన్ల మరమ్మతు, మోటార్లు, ట్రాక్టర్ల నిర్వహణ నిధులు లేక జాప్యం అవుతోంది. సీఎం ప్రకటించిన నిధులు వస్తే చాలు కొన్ని పనులైనా చేసుకుంటామనే ఆలోచనల్లో సర్పంచ్‌లు ఉన్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ)నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగని దుస్థితి. బాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేకపోవడంతో పలువురు సర్పంచ్‌లు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ కొనుగోలుకు సొంత డబ్బులు వెచ్చించారు. సీఎం ప్రకటన మాత్రం తమకు ఊరట కలిగిస్తోందని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.
కేంద్రం నిధులతో సంబంధం లేకుండా..
అభివృద్ధికి నిధులు ఖర్చు పెడతాం..
నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీలకు శుభవార్త చెప్పారు. ఈ నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తాం. నిధులు రాగానే ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేసిన తర్వాత ప్రజల అవసరాలకు పారదర్శకంగా ఖర్చు పెడుతాం.
– గోపతి రవళి, సర్పంచ్, కృష్ణానగర్, సంగెం
పంచాయతీలకు ఊరట
పంచాయతీలకు ఊరట


