వంద పడకల ఆస్పత్రి ప్రజల కల
వర్ధన్నపేట: వంద పడకల ఆస్పత్రి నియోజకవర్గ ప్రజల ఏళ్ల కల అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. రూ.28 కోట్లతో నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆస్పత్రికి భూమిపూజ, రూ.15 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులను కలెక్టర్ సత్యశారదతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసినవారు ఏం అభివృద్ధి పనులు చేశారో ప్రజలు ప్రశ్నించాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను మున్సిపాలిటీ నుంచి వేరు చేసే ప్రక్రియ కొంత ఆలస్యమైందని, ఎన్నికల అనంతరం మంత్రి సీతక్క చొరవతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఆస్పత్రి సాధన సమితి సభ్యులు తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావును సన్మానించారు.
ఇందిరమ్మ ఇళ్లపై
పవర్ పాయింట్ ప్రజంటేషన్..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇందిరమ్మ ఇళ్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్, పట్టణ అధ్యక్షుడు మైస సురేశ్, నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


