మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్లు
న్యూశాయంపేట: జిల్లాలోని ఐదు మైనార్టీ (రెండు బాలురు, మూడు బాలికలు) గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో అధికారులతో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 2026–27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినీవిద్యార్థులు టీజీఎంఆర్‌ఈఐఎస్‌తెలంగాణ.సీజీజీ.జీఓవీ.ఇన్‌లో వచ్చే నెల 28వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు హనుమకొండ సర్క్యూట్ హౌస్‌రోడ్డులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎండబ్ల్యూఓ రమేశ్, ఆర్‌ఎల్‌సీ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలను నియంత్రించాలి
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మత్తు పదార్థాలను నిరోధించి, యువత, విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీధర్‌సుమన్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, నర్సయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు, అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి..
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో వేడుకల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఖుష్‌మహల్ వద్ద నిర్వహించనున్న వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈనెల 25న విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటు ప్రాముఖ్యతపై కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలన్నారు. సీనియర్ సిటిజన్స్‌ను గుర్తించి ఓటర్స్ డే సందర్భంగా సన్మానించాలన్నారు. ఫ్లాష్‌మాబ్, మానవహారం, అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


