తప్పుడు కేసుల కలకలం! | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసుల కలకలం!

Dec 23 2025 6:44 AM | Updated on Dec 23 2025 6:44 AM

తప్పుడు కేసుల కలకలం!

తప్పుడు కేసుల కలకలం!

తప్పుడు కేసుల కలకలం! అకారణంగా కొందరిని టార్గెట్‌ చేస్తున్నారని.. ఏం తప్పుడు కేసులంటే..

వరంగల్‌ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్‌పై డీజీపీ వేటు

సాక్షి,వరంగల్‌/రామన్నపేట: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్‌ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన నందిరాం నాయక్‌ను రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సస్పెండ్‌ చేయడం పోలీస్‌శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్‌ సీసీఎస్‌ సీఐ గోపీ, ఎస్‌ఐ విఠల్‌ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్‌ సబ్‌ డివిజన్‌లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే.

వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో అకారణంగా కొందరిని టార్గెట్‌గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్‌ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ చేశారు. ఇతర అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్‌లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్‌ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది.

● వరంగల్‌ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్‌లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్‌ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్‌ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్‌ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

● మా బంధువులు శేఖర్‌, శ్రీనివాస్‌ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్‌లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్‌గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్‌ ఎల్‌బీనగర్‌కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్‌లో ఎంజీఎం మూడో గేట్‌ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్‌తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

సీఐ గోపీ, ఎస్‌ఐ విఠల్‌ను కూడా సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు

మట్టెవాడ స్టేషన్‌లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు

తాజా చర్యలతో వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో కొందరు అధికారుల ఉలికిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement