రాజకీయాలకతీతంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్ : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 7వ డివిజన్లో రూ.కోటితో సైడ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాకాజీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రధానంగా డ్రెయిన్ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న ఒక్కో వార్డుకు కనీసం రూ.50 లక్షలు పెట్టిన దాఖలాలు లేవని, నేడు ప్రతీవార్డుకు రూ.5కోట్ల పై మేర నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ నాయకులు తోట పవన్, మాజీ కార్పొరేటర్ శేఖర్, సోమ నాగేశ్వర్ రావు, బిన్నీ లక్ష్మణ్, వాకర్ అసోసియేషన్ బాధ్యులు గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి


