ఈ నెలాఖరులోగా నారు వేసుకోవాలి
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ కో–ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ మండలంలోని సింగారం, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, యాసంగి వరి నారు మడులను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. యాసంగి మక్కజొన్న తొలిదశలో ఆశించే కత్తెర పురుగు నివారణకు వేపనూనెను పిచికారీ చేయాలని సూచించారు. మిరప శాఖీయ దశలో ఉందని వేరుకుళ్లు తెగులు, ఆకుముడత ప్రధాన సమస్యలుగా ఉన్నట్లు గమనించారు. అందుకు చేయాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఆకుముడత, తెల్ల దోమల నివారణకు ఎకరాకు 15 నుంచి 20 పసుపు రంగు జిగురు అట్టలను, అలాగే తామర పురుగుల నుంచి కాపాడుకోవడానికి 20 నుంచి 30 నీలం రంగు జిగురు అట్టలను పొలమంతా అమర్చుకోవాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి పొలంలోనే కలియదున్నాలన్నారు. వరి నార్లు డిసెంబర్ నెల లోపల వేసుకోవాలన్నారు. చలి ఉధృతి పెరుగుతున్నందున ఉదయం, సాయంత్రం నారుమడుల్లో కొత్తనీరు పెట్టుకోవాలని సూచించారు. రైతులు అన్ని పంటల్లో యాజమాన్య పద్ధతులను పాటించి పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని కోరారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్‌పీరిఝెన్స్ ప్రోగ్రాంలో భాగంగా అగ్రికల్చర్ విద్యను అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు సందర్శనలో పాల్గొన్నట్లు విజయ్‌భాస్కర్ తెలిపారు.
శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్
పంటక్షేత్రాల సందర్శన


