అలసత్వం వద్దు
వినతులు తక్షణమే పరిష్కరించాలి
● కలెక్టర్ సత్యశారద
● ప్రజావాణిలో 165 అర్జీలు
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వం వహించొద్దని, వినతులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణిలతో కలిసి ప్రజావాణి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌లో భూ సమస్యలు 45, గృహ నిర్మాణ 15, కలెక్టరేట్ 15, డీడబ్ల్యూఎంసీ 8, పోలీస్‌శాఖ 6, ఇతర శాఖలకు సంబంధించినవి 76 (మొత్తం 165) దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి తమ పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. పరిష్కారం కాని అంశాలపై దరఖాస్తుదారుడికి లిఖిత పూర్వకంగా తెలుపుతూ సరైన సూచనలు ఇవ్వాలన్నారు.
పాఠశాలలను సందర్శించాలి
అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో శుభ్రత, తాగునీటి సౌకర్యాలు, హాస్టల్ వాతావరణం మెరుగు పర్చే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడంలో స్ఫూర్తి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్న నేపధ్యంలో ఈనెల 13వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు పాల్గొని విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ పరిధిలోని పలు ప్రాంతల్లో విచ్చల విడిగా నిషేధిత గుట్కాలు, అంబర్‌తో పాటు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని యువజన సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు మచ్చిక రాజుగౌడ్ విన్నవించారు.


