
మహా దుర్గ అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఎనిమిదో రోజు సోమవారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చన, త్రిపురోపనిషత్, దేవ్యుపనిషత్ పారాయణాలు, ఆవరణ పూజ, సువాసిని పూజ, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకారాలను దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు. కార్యక్రమంలో వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్ శర్మ, దేవేందర్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.