మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం?
చేపల వేట, పెంపకంపై ఆధారపడి జీవించే మత్స్యకారులు చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు మృతిచెందితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితమైతే చెరువులోని ఇతర జలచరాల మనుగడపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చెరువును పరిశీలించి చేపలు, తాబేళ్ల మృతికి గల అసలు కారణాలను గుర్తించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చెరువులోని నీటి నమూనాలను సేకరించి రసాయన కాలుష్యం, తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు, ఇతర నీటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించాలి. మృతి చెందిన చేపలు, తాబేళ్లను కూడా పరిశీలిస్తే చనిపోవడానికి దారితీసిన కారణాలను గుర్తించే అవకాశం ఉంటుంది. చెరువులోకి మురుగు నీరు చేరుతుండటం గమనార్హం.
●
వనపర్తి: జిల్లాకేంద్రంలోని నల్ల చెరువులో పెద్ద చేపలతో పాటు తాబేళ్లు సైతం చనిపోయి నీటిపై తేలుతుండటం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు నీటి నుంచి దుర్వాసన వెలువడుతుండటంతో నీటి కాలుష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాబేళ్లు సైతం మృతిచెందడంతో చెరువు నీటిలో విషపూరిత రసాయనాలు కలిసినట్లు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో చెరువుపై ఆధారపడి జీవించే మత్స్యకారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల నిర్వహించిన గణేష్ నిమజ్జనాలతో చెరువులో ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. విగ్రహాలకు వినియోగించిన రంగులు, రసాయనాలు, ఇతర పదార్థాలు నిమజ్జనాల సమయంలో చెరువు నీటిలో కలవడంతో జలచరాలపై ప్రభావం పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, రసాయన కాలుష్యం, మురుగు లేదా ఇతర విష పదార్థాలు చేరడంతో చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాలు మృతి చెందే అవకాశం ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. నీటిని పరీక్షిస్తే తప్పా అసలు విషయం చెప్పడం సాధ్యం కాదు. చెరువులో చేపలు చనిపోవడం కలవరపెడుతుండగా.. ఎప్పడూ లేనివిధంగా తాబేళ్లు సైతం మృత్యువాత పడిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
నీటి నాణ్యత, చనిపోయిన చేపలను పరీక్షిస్తాం..
జిల్లాకేంద్రంలోని నల్ల చెరువులో చేపలు, తాబేళ్లు మృతిచెందిన విషయం మా దృష్టికి రాలేదు. చెరువులోని నీటి నాణ్యతను పరీక్షిస్తాం. మృతిచెందిన చేపలు, తాబేళ్లును పరీక్షించి మృతికి గల కారణాలను తెలుసుకొని మిగిలినవి మృతి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి సమస్య లేదు. ఒకవేళ నీటిలో ఆక్సీజన్ శాతం తగ్గితే ఇతర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించేవి. నల్ల చెరువులోనే ఎక్కువ నీరు నిల్వ ఉంది. నీటి నాణ్యతలోనే ఏదైనా సమస్య ఉండవచ్చు. వెంటనే పరీక్షిస్తాం. – లక్ష్మప్ప,
జిల్లా మత్స్యశాఖ అధికారి, వనపర్తి
తాబేళ్లు, వందల సంఖ్యలో పెద్ద చేపలు మృత్యువాత
నీటిలో విషపూరిత రసాయనాలు కలిశాయనే అనుమానాలు
గణేష్ నిమజ్జనాలే కారణమా?
ఇటీవలే 94 వేల చేపపిల్లలను వదిలిన వైనం
ఆందోళనలో మత్స్యకారులు


