కొత్తకోట రూరల్: జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర 6వ మహాసభలు హైదరబాద్‌లో జరగగా ఆదివారం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా కొత్తకోట జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు దేవని ప్రవీణ్‌కుమార్ ఎన్నియ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం, మూఢనమ్మకాలు నిర్మూలించడం, విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక మరింత బలోపేతం కావాలని, శాసీ్త్రయ చైతన్య ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రవీణ్‌కుమార్ ఎంపిక పట్ల తోటి ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.
నేడు రైతువేదికల్లో సీఎం సందేశం
వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో మారనున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయరంగంపై వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారని.. ఈ కార్యక్రమం సమీపంలోని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక, సాగు విధానం, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికసంఖ్యలో పాల్గొని వీక్షించాలని కోరారు.
గిరిజన సేవాసంఘం జిల్లా కార్యవర్గం
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన గిరిజన సంఘం సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు, గిరిజన పెద్దలు పాల్గొని జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముడావత్ సూర్యానాయక్, ప్రధానకార్యదర్శిగా టీక్యానాయక్, కోశాధికారిగా కృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్య, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
17న మహాధర్నా
జడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పాలమూరుకు దక్కాల్సిన నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటి వనరుల కల్పనలో విఫలమయ్యాయని, శాశ్వత ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి రైతులు, నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
విజేతలుగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లు తరలివెళ్లాయి. కబడ్డీ జట్లను స్థానిక మెయిన్ స్టేడియంలో వేణుగోపాల్ అభినందించారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. అదే విధంగా సిద్దిపేటలో ఆదివారం నుంచి జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17 బాల, బాలికల రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బయలుదేరారు. క్రీడాకారులను జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.


