రైతుల గోస పట్టదా..? | - | Sakshi
Sakshi News home page

రైతుల గోస పట్టదా..?

Oct 5 2026 12:09 AM | Updated on Oct 5 2026 12:09 AM

గోపాల్‌పేట: మండలంలోని బుద్ధారం పెద్ద చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే క్రమంలో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏడాదికి రెండు పంటలు పండే భూములు రిజర్వాయర్‌లో పోతుండటంతో రైతులు తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే పరిహారం ఏమాత్రం సరిపోదని చెప్పినా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. వనపర్తి – హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనే ఉండి, పుష్కలంగా పంటలు పండే భూములకు రూ. 15లక్షల చొప్పున మాత్రమే నష్టపరిహారం ఇస్తుండటంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. దీనికి తోడు ఇటీవల రెవెన్యూ అధికారులు భూ నిర్వాసిత రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇస్తుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

సర్వం కోల్పోతున్నాం..

మాకు ఆరెకరాల భూమి ఉండగా.. ఐదెకరాలు రిజర్వాయర్‌ కోసం తీసుకుంటున్నారు. కేవలం ఒక ఎకరా మాత్రమే మిగి లింది. ఇప్పుడు కోల్పోయిన పొలంలో మూడు బోర్లు ఉన్నాయి. రెండింటి నుంచి పుష్కలంగా నీరు వస్తున్నాయి. ఒక బావి కూడా ఉంది. వీటన్నింటికి తక్కువ పరిహారం ఇచ్చి, బలవంతంగా తీసుకోవడం సరికాదు. మాకు రూ. 40లక్షల పరిహారం చెల్లించాలి. – కావలి లక్ష్మి,

భూ నిర్వాసిత రైతు, బుద్ధారం

ఎలా బతకాలో తెలియడం లేదు..

మాకు 2.20 ఎకరాల భూమి ఉంది. మొదటి విడతలో 20 గుంటల భూమి పోయింది. ఇందుకు ప్రభుత్వం రూ. 6లక్షలు చెల్లించింది. మళ్లీ ఇప్పుడు ఎకరన్నర భూమిని తీసుకుంటున్నారు. ఇక అరెకరా పొలం మాత్రమే మిగులుతుంది. మాకు బోరు ఉంది. సంవత్సరానికి రెండు పంటలు పండిస్తాం. మా అమ్మ, నాన్న, భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా.. అరెకరా భూమితో ఎలా బతకాలో తెలియడం లేదు. ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలి.

– యాదయ్య, నిర్వాసిత రైతు, బుద్ధారం

చట్టప్రకారం నోటీసులు..

బుద్ధారం మినీ రిజర్వాయర్‌ కోసం రెండో విడత సేకరించాల్సిన భూములకు అవార్డు ప్రకటించాం. స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తే ఎకరాకు రూ. 15లక్షల చొప్పున నష్టపరిహారం అందుతుంది. జనరల్‌ అవార్డు అయితే అక్కడ ఉన్న మార్కెట్‌ విలువకు మూడింతలు ఎక్కువగా వస్తుంది. దీనికి తోడు బోర్లు, బావులు, చెట్లు ఉంటే విడిగా డబ్బులు వస్తాయి. చట్టప్రకారం నోటీసులు అందించగా.. ఇప్పటికే 30మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మరో 60మంది జనరల్‌ అవార్డు కోసం చెప్పారు. త్వరలోనే సమస్య తీరుతుంది.

– తిరుపతయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

ఇదీ మినీ రిజర్వాయర్‌ పరిస్థితి..

బుద్ధారం పెద్ద చెరువును రూ. 22కోట్లతో 0.098 టీఎంసీల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్‌గా నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌కు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–8 కాల్వ 16.5 కి.మీ. వద్ద (అల్లీపూర్‌) సమీపం నుంచి నీటిని పంపింగ్‌ చేయనున్నారు. జలాశయం బండ్‌ నిర్మాణానికి 11.57 ఎకరాలు సేకరించి.. 6 మీటర్ల వెడల్పు, కిలోమీటర్‌ పొడవు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించారు. మరో 100 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే ఎడమ కాల్వ ద్వారా 10వేల ఎకరాలు, కుడి కాల్వ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 15లక్షల పరిహారంతో అన్యాయానికి గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు బోరుబావులు, తోటలకు విడిగా పరిహారం అందించాలని, భూ నిర్వాసిత రైతులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోకుండా ఇళ్లకు నోటీసులు అంటించి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

శిక్షణ కోసం దరఖాస్తులు

మన్ననూర్‌: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ మన్ననూర్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ చెంచు, గిరిజన అభ్యర్థులకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గాను 60 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ సలోని ఛాబ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన అర్హులైన యువతీ, యువకులను పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు సంసిద్ధులను చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమశాఖ ఈ సువర్ణావకాశం కల్పిస్తుందన్నారు. అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. స్క్రీనింగ్‌ టెస్టు ద్వారా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి.. 2 నెలలపాటు ప్రిలిమ్స్‌ పరీక్ష వరకు ఉచిత రెసిడెన్సియల్‌ కోచింగ్‌ అందిస్తుంది. అభ్యర్థులు రూ.3 లక్షల పరిమితికి సంబంధించిన ఆదాయ, కుల, ఆధార్‌, అర్హత ధ్రువపత్రాలతోపాటు అభ్యర్థి పోలీస్‌ ఉద్యోగానికి చేసిన దరఖాస్తుతో సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 9 వరకు సమర్పించాలని చెప్పారు.

ఎకరాకు రూ.20లక్షలు చెల్లించాలని..

నష్టపరిహారం పెంచాలంటున్న ‘బుద్ధారం’ భూ నిర్వాసితులు

ఎకరాకు రూ.15లక్షలే చెల్లిస్తామని నోటీసులు

రూ.20లక్షల పరిహారం అందించాలని రైతుల వేడుకోలు

బోరుబావులు, తోటలకు విడిగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement