టెనెంట్‌ సమస్య త్వరలోనే పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

టెనెంట్‌ సమస్య త్వరలోనే పరిష్కరిస్తాం

Oct 5 2026 12:09 AM | Updated on Oct 5 2026 12:09 AM

కొత్తకోట: పట్టణంలోని రాఘవేంద్ర, బీసీ కాలనీల ప్రజలు టెనెంట్‌ కేసు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భరోసానిచ్చారు. ఆదివారం కొత్తకోటకు వచ్చిన ఆయనను కాలనీ ప్రజలు ప్రత్యేకంగా కలిసి తమ గోడుపై మరోసారి విన్నవించారు. ఓ అధికారి చేసిన తప్పిదం కారణంగా మూడేళ్లుగా కాలనీలో ప్లాట్లు, ఇళ్లను అమ్ముకోలేకపోతున్నామని.. కొత్తగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లపై బ్యాంకులో కూడా రుణం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కాలనీవాసుల సమస్యపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. గత ప్రభుత్వంలో అధికారుల నిర్వాహకంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి కేసులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఎక్కువగా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఏళ్ల తరబడి కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి, కేసు వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. ఇది వందశాతం తప్పుడు కేసుగా గుర్తించినట్లు ఒక న్యాయవాదిగా తన అనుభవంతో చెబుతున్నానని కాలనీవాసులకు వివరించారు. ఇందుకు కారణమైన అధికారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నరేంద్ర సాగర్‌, సుభాష్‌, కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ప్రశాంత్‌, బోయేజ్‌, శేఖర్‌ రెడ్డి, బీచుపల్లి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement