గోపాల్‌పేట: జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వేను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం గోపాల్‌పేట మండలం చెన్నూరు గ్రామ శివారులో చేపట్టిన సమగ్ర భూ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంట చేతికొచ్చే సమయం, సాగు వివరాలను రైతులతో తెలుసుకున్నారు. భూ సర్వేకు సంబంధించి కో–రిలేషన్ రిజిస్టర్ నిర్వహణ పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి.. భూ సర్వే లక్ష్యాలు, ప్రాధాన్యత ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే చేపట్టే భూముల వివరాలను ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా భూ సర్వే చేస్తున్నప్పుడు హద్దురాళ్లకు వివిధ రంగుల కలర్లు వేయాలని చెప్పారు. జిల్లాలో 15 మండలాలకు గాను 12 మండలాల్లో సర్వే ప్రారంభమైందని.. తొలి విడతలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


