కొల్లాపూర్: ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ.. దాదాపు 80 కి.మీ., మేర దూరభారం తగ్గించే రహదారి.. మరోవైపు ఎన్నో ఏళ్ల పోరాటం, కృష్ణానదిలో నాటు పడవ ప్రమాదాల్లో ఎంతోమంది మృతిచెందిన తర్వాత మంజూరైన వంతెన. ఈ రెండు పనులను ఒకే ప్రాజెక్టుగా అనుసంధానిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి–167కే నిర్మాణానికి నిధులు కేటాయించింది. సుమారు ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డు పనులు మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇక కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెన ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి టెండర్లను కూడా కేంద్రం మూడేళ్ల క్రితమే ఆహ్వానించింది. దీనికి ఎన్నో ప్రముఖ కంపెనీలు టెండర్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికీ ఓపెన్ కావడం లేదు. ఇందుకు ప్రధానంగా రెవెన్యూ పరిధిలోని భూ సేకరణలో జాప్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రెండు ప్రాంతాలు, లక్షలాది మంది ప్రజలకు మేలు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పాలకులు, అధికారుల చిత్తశుద్ధిని వేలెత్తి చూపేలా చేస్తోంది.
ఐదు ప్యాకేజీలుగా విభజన
జాతీయ రహదారి–167కేను 2021లో మంజూరు చేశారు. ఐదు ప్యాకేజీలుగా పనులను విభజన చేశారు. మొదటి ప్యాకేజీలో భాగంగా అదే ఏడాది సెప్టెంబర్‌లో కల్వకుర్తి నుంచి సోమశిల రోడ్డు వరకు రహదారి విస్తరణ, బైపాస్ నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు ఓపెన్ చేశారు. ఈ పనుల టెండర్‌ను రూ.436.91 కోట్లకు ఆర్‌కే ఇన్‌ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. వీరు 2023 జూలైలో అధికారికంగా పనులు ప్రారంభించారు. ఈ పనులు దాదాపుగా తుదిదశకు చేరుకున్నాయి. తాడూరు సమీపంలో బైపాస్ రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 85 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన 4, 5 ప్యాకేజీల పనులు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి.
2023లో టెండర్ల ఆహ్వానం..
2, 3వ ప్యాకేజీలలో కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారి–167కే మొత్తం పొడవు 185.90 కి.మీ., కాగా.. 87.360 – 88.437 కి.మీ., మధ్యభాగంలో ఐకానిక్ వంతెన నిర్మిస్తారు. ఈ పనుల కోసం రూ.963 కోట్లు కేటాయించి 2023 నవంబర్ 2న టెండర్లను నేషనల్ హైవే అథారిటీ ఆహ్వానించింది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వంతెన పనులు చేపట్టే ప్రదేశానికి వెళ్లే దారిలో అటవీ, రెవెన్యూ భూములను సేకరించాల్సి ఉంది. భూ సేకరణలో జాప్యం కారణంగా మూడేళ్లుగా టెండర్ల ఓపెన్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 39 సార్లు టెండర్ల ఓపెన్ గడువును వాయిదా వేస్తూ వచ్చారు.
ఊగిసలాడుతున్న కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం
టెండర్లు తెరిచేందుకే మూడేళ్లు గడిచిపోయిన పుణ్యకాలం
వివిధ రకాల సాకులతో 39 సార్లు వాయిదాల పర్వం
రెవెన్యూ పరిధిలో భూ సేకరణలో జాప్యమే ప్రధాన కారణం
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కొరవడిన చిత్తశుద్ధి
నోటీసులు జారీచేశాం..
కొల్లాపూర్ సమీపం నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి 53 హెక్టార్ల భూ సేకరణ చేపడుతునున్నాం. ఇందులో 25 హెక్టార్ల అటవీ భూమి ఉండగా వారి నుంచి ఎన్‌ఓసీ వచ్చింది. రెవెన్యూ పరిధిలోని భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. భూములు కోల్పోయే వారికి నోటీసులు జారీచేశాం. ఇటీవలే కొందరు రైతులకు పరిహారం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. అయితే దాదాపుగా 70 మంది రైతులు మాత్రం ఇప్పటి వరకు తమ భూములకు సంబంధించిన పత్రాలు సమర్పించలేదు. వారికి కొన్ని రోజుల క్రితమే ఫాం–2 నోటీసులు ఇచ్చాం. నిర్ణీత సమయంలోగా వారు స్పందించకుంటే నిబంధనల ప్రకారం ఆయా భూములను స్వాధీనం చేసుకుంటాం.
– భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్
భూ సేకరణలో తీవ్ర జాప్యం..
జాతీయ రహదారి పనుల కోసం కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం, మల్లేశ్వరం, వరిదేల గ్రామాల శివార్లలో భూసేకరణ చేపట్టాలి. ఏడాదిన్నర క్రితం భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి.. రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లింపులు జరగలేదు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో టెండర్ల గడువును పొడిగిస్తూ వస్తున్నట్లు నేషనల్ హైవే అధికారులు వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణ ప్రాంతంలో 25 హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. దాన్ని రోడ్డు నిర్మాణానికి వాడుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిధిలోని భూసేకరణ మాత్రమే పెండింగ్‌లో ఉంది. భూసేకరణ పూర్తయితే వంతెన వరకు రోడ్డు నిర్మించి, ఆ తర్వాత వంతెన పనులు చేపట్టాల్సి ఉంటుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు వెల్లడించారు. టెండర్లు ఓపెన్ చేస్తే కాంట్రాక్టు కంపెనీకి వెంటనే భూమిని అప్పగించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.


