అన్నదాతకు మద్దతుగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు మద్దతుగా పోరాటం

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

అమరచింత: ఎగువ నుంచి వస్తున్న వరదను తోడుకునే వీలున్నా.. దిగువన ఉన్న ఆంధ్రాకు పంపుతామంటే ఇక్కడి రైతులు చోద్యం చూస్తూ ఉండరని, అన్నదాతలకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆత్మకూర్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ఉందని, సాగునీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి రైతులను భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడేళ్లకుపైగా వర్షం కురవకపోయినా ఇక్కడి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని.. పచ్చిమ కనుమల్లో దట్టమైన అడవులు ఉండటంతో ప్రతి వర్షాకాలంలో తుంగభద్ర, కృష్ణా, భీమానదులు ఉధృతంగా పారుతుంటాయని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు ఎల్లూరు నుంచి 9 టీఏంసీల నీరు అవసరమని.. వచ్చే జూన్‌ వరకు మిషన్‌ భగీరథ నీటికి ఇబ్బంది లేదని, వీటిని సాకుగా చూపుతూ జూరాల ఆయకట్టును ఎండబెట్టుదామనే ఆలోచనలో ఇక్కడిి మంత్రి ఆలోచించడం ఏమిటన్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 123 టీఏంసీలు, నారాయణపూర్‌లో 30 టీఏంసీల నీరు ఉందని.. అక్కడ పంటలు సాగైతే వర్షం పడకపోయినా జూరాలకు ఐదువేల క్యూసెక్కుల వరద రోజు వచ్చి చేరుతుందని చెప్పారు. పాలమూర్‌లో కృష్ణానది మీద ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపినా రోజుకు ఒక టీఎంసీ మించి వాడుకోలేమని.. అందుకే పాలమూర్‌–రంగారెడ్డి ప్రాజెక్టుతో రోజు రెండు టీఏంసీల నీరు ఎత్తిపోసేలా డిజైన్‌ చేసి తమ పాలనలో పనులు చేపట్టామని, మిగిలిన పనులు చేయలేక.. నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్‌రెడ్డి కాలయాపన చేయడం ఏమిటన్నారు.

జూరాల కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జూరాల వద్ద బుధవారం ఆందోళన చేయడానికి వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే అక్కడి లష్కర్లతో కాల్వ గేట్లు తెరిపించారని మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కేఎల్‌ఐ ఒక పంప్‌ ఆన్‌ చేశారని.. నిరంతరంగా మూడు పంపులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, జిల్లా మీడియా కన్వీనర్‌ నందిమళ్ల అశోక్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్‌, మాజీ పుర చైర్‌పర్సన్‌ గాయత్రి, పలుస రమేష్‌గౌడ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు విశ్వేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement