వనపర్తి: నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తిని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కూడా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులను వెంటనే గుర్తించాలన్నారు. వాటిని అర్హులైన పేదలకు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన 287 గుడిసెలతో పాటు నియోజకవర్గంలో మిగిలిన గుడిసెలను పూర్తిస్థాయిలో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని, ఈ ప్రక్రియతో పాటు పెండింగ్ అంశాలన్నింటినీ వారంలోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విఠోబా, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


