సవాళ్లను అధిగమించి ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

సవాళ్లను అధిగమించి ధాన్యం సేకరణ

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 12:41 AM

మొదటిసారి 42 గోదాంలలో నిల్వ

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

కాశీవిశ్వనాథ్‌

వనపర్తి: జిల్లాలో యాసంగి సీజన్‌ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా ముగింపు దశకు చేరుకుందని, అన్నిరకాల సవాళ్లను అధిగమిస్తూ రికార్డుస్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేశామని జిల్లా పౌరసరఫరాలశాఖ కాశీవిశ్వనాథ్‌ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని.. రెండు, మూడురోజుల్లో వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 12వ స్థానంలో నిలిచిందని వివరించారు. మొదటిసారి 42 గోదాములను నిల్వ కేంద్రాలుగా వినియోగించుకున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని 62 మిల్లుల్లో ధాన్యం దించామని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గోదాములకు కూడా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. ట్యాబ్‌ఎంట్రీ ప్రక్రియ ప్రస్తుతం 77 శాతానికి చేరిందని, ఇప్పటి వరకు రూ.358 కోట్లను రైతుల ఖాతాలో జమచేసినట్లు వివరించారు. వ్యవసాయశాఖ వేదికల ఆధారంగానే కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. ఒకే వెహికల్‌ నంబర్‌పై రెండు, మూడుచోట్ల టెండర్లు వేశారనే ఆరోపణలపై డీటీఓతో పూర్తి విచారణ జరిపించామని తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జరిగిన మొక్కజొన్న కొనుగోళ్ల కోసం లారీలు, గన్నీ బ్యాగులు తరలింపుతోనే కొంత గందరగోళం నెలకొందని, దానికి పౌరసరఫరాలశాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణంగా 100 కిలోల ధాన్యానికి 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుందని, తాలు పర్సంటేజ్‌ ఎక్కువగా ఉన్నప్పుడే మిల్లర్లు తరుగు డిమాండ్‌ చేస్తారని వివరించారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాగానే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను క్షేత్రస్థాయికి పంపి మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement