ధాన్యం.. దైన్యం! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం.. దైన్యం!

Apr 26 2026 2:09 AM | Updated on Apr 26 2026 2:09 AM

ఆరేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల పంపిణీ

పొంచి ఉన్న అకాల వర్షాల ముప్పు

ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద

అద్దెకు తీసుకుంటున్న వైనం

ఆందోళనలో అన్నదాతలు

కొత్తకోట రూరల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి.. కొనుగోలు కేంద్రాలు కూడా లాంఛనంగా ప్రారంభించినా ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబెట్టుకుంటున్నారు. వాతావరణంలో మార్పులతో వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతుల వద్ద టార్పాలిన్లు లేక ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

● గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50 శాతం రాయితీతో టార్పాలిన్లు రైతులకు అందజేసింది. ధర రూ.2,500 ఉంటే రూ.1,250కి విక్రయించింది. తర్వాత ఈ పథకాన్ని వ్యవసాయశాఖకే పరిమితం చేయగా.. చివరిగా 2018లో వీటిని పంపిణీ చేశారు. ఆరేళ్లుగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో కొందరు అన్నదాతలు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పూర్తి ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో టార్పాలిన్‌కు రూ.4 వేల వరకు ధర ఉందని రైతులు చెబుతున్నారు. ఈ యాసంగిలోనైనా రాయితీపై అందివ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.

అదనపు భారం..

పండించిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోనేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోదానికి రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లిస్తారు. రెండెకరాల ధాన్యానికి సుమారు 10 టార్పాలిన్లు అవసరమవుతాయి. రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత యాసంగిన 20 రోజులపైనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉంచాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్కరిపై రూ.2 వేల పైనే భారం పడింది.

తేమ పేరుతో కొర్రీలు..

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు 17 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందంటూ కేంద్రాల వద్ద రోజుల తరబడి ఆరబెట్టాల్సి వస్తోందని.. అకాల వర్షాలకు ధాన్యం టార్పాలిన్లు లేక తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి రాయితీ ఇస్తున్నప్పటికీ టార్పాలిన్ల పంపిణీపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఎలాంటి సమాచారం లేదు..

ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం అందుబాటులో ఉంచాం. సర్దుబాటు చేసుకోవాలి. రాయితీ టార్పాలిన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ప్రకటిస్తే రైతులకు తెలియజేస్తాం. – దామోదర్‌, ఏడీఏ, కొత్తకోట

నిర్లక్ష్యం సరికాదు..

యాసంగి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాం. అనుకోకుండా వర్షం వస్తే కప్పేందుకు టార్పాలిన్లు లేవు. దీంతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు.

– బాజ గిరన్న, రైతు, కానాయపల్లి

Advertisement
 
Advertisement
Advertisement