కమీషన్ల కక్కుర్తి..!?
ట్రాక్టర్ల కొనుగోళ్లలో పుర అధికారుల లీలలు
● ప్రతిపాదనలు ఒకలా..వచ్చినవి మరోలా...
● స్వీపింగ్ మిషన్ బాగోతం మరువకముందే మరో ఉదంతం
● అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు
● హడావుడిగా షోరూంకు తిప్పిపంపిన వైనం
రూ.రెండు లక్షల తేడా..
విషయం బయటకు తెలియడంతో అధికారులు గుట్టుగా సదరు కంపెనీకి ట్రాక్టర్లను తిప్పి పంపించే ప్రయత్నం చేశారు. అధికారుల చర్యలు పుర సిబ్బంది, ప్రజల్లో నవ్వుల పాలయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఒక్కో ట్రాక్టర్ ధరలో రూ.2 లక్షల మేర తేడాతో ఉ న్న పాత సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను తె ప్పించి కమీషన్లు దండుకునేందుకు ప్రయత్నా లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వనపర్తి: స్థానిక పురపాలికలో 2021లో సుమారు రూ.65 లక్షలు వెచ్చించి స్వీపింగ్ మిషన్ కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి బాగోతం నాలుగేళ్లు గడిచినా కొలిక్కిరాలేదు. కనీసం నెలరోజులు కూడా వినియోగించని ఈ యంత్రాన్ని మరమ్మతుల పేరిట కొంతకాలంగా ఇతర ప్రాంతానికి తరలించారు. కమీషన్ల కోసం పాత యంత్రానికి రంగులద్ది కొత్తదిగా పేర్కొంటూ అధికార, పాలకవర్గం ప్రజాధనాన్ని వృథా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం మరువకముందే పుర అఽధికారులు ట్రాక్టర్ల కొనుగోళ్లలో మరో కమీషన్ల వ్యవహారానికి తెరతీయడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
● విస్తరిస్తున్న పట్టణానికి అనుగుణంగా చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం కలెక్టర్ అనుమతితో మూడు ట్రాక్టర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. ఆధునిక సాంకేతికత కలిగిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. కానీ దశాబ్దా కాలానికి ముందున్న ట్రాక్టర్లను తీసుకొచ్చి ఇవే కొత్తవి అంటూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో అధికారికంగా ప్రారంభింపజేశారు. తీరా పుర డ్రైవర్లు పరిశీలించగా.. ట్రాక్టర్లలోని డొల్లాతనం బయటపడింది. నెలరోజుల తర్వాత అంచనాల్లో పేర్కొన్న సాంకేతికత వేరు.. సదరు కంపెనీ నుంచి అధికారులు తెప్పించిన ట్రాక్టర్లు వేరు అన్న విషయం బయటకు పొక్కింది. పదేళ్ల కిందట కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు పంపిన ట్రాక్టర్లకు పవర్ స్టీరింగ్ లేకుండా ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు.
విచారణ చేపడతాం..
ట్రాక్టర్ల కొనుగోలులో జరిగిన ఉదంతంపై పుర కమిషనర్‌తో చర్చించా.. పవర్ స్టీరింగ్ ట్రాక్టర్ల కొనుగోలుకే ప్రతిపాదనలు ఇచ్చాం. సాధారణ స్టీరింగ్‌తో వచ్చిన ట్రాక్టర్లని ఆలస్యంగా గుర్తించాం. ఇంకా చెల్లింపులు జరగలేదు. ఆయా ట్రాక్టర్లను తిరిగి షోరూంకు పంపించామని చెప్పారు. స్వీపింగ్ మిషన్ విషయంపై విచారణ చేపడతాం. – యాదయ్య,
స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్
కమీషన్ల కక్కుర్తి..!?
కమీషన్ల కక్కుర్తి..!?


