న్యాయసేవలు సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: పేదలకు ఉచిత న్యాయసాయం అందించడం, ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన పెంపొందించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి అన్నారు. న్యాయ సేవాధికార చట్టం 1987 అమలును స్మరించుకుంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని సూచన మేరకు ఆదివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజీయే రాజమార్గమంటూ కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత న్యాయసాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్, ఉచిత న్యాయ సలహా కేంద్రాలు, మధ్యవర్తిత్వం విధానాలతో తక్షణ పరిష్కారం పొందవచ్చని వివరించారు. జిల్లా ప్రజలు న్యాయసేవల ప్రయోజనాలను వినియోగించుకోవాలని, హక్కుల రక్షణ కోసం చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం, న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని.. ప్రతి ఒకరికి ఉచిత న్యాయసేవలు, న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం న్యాయసేవలపై తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సఖి కేంద్రం ప్రతినిధి కవిత, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


