● పండగొస్తేనే..ప్యాచ్ వర్క్
● రూ.1.07 కోట్లతో హడావుడి ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు సమీపిస్తుండడంతో నగరపాలక సంస్థలో ఏర్పాట్ల హడావుడి మొదలైంది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలిచ్చే ఉత్సవాలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించాల్సిన అధికారులు పండగ సమయం వచ్చేసరికి రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు, డివైడర్లకు రంగులు, గోడలకు వెయింటింగ్‌లు, తాత్కాలిక మరుగుదొడ్లు, చలివేంద్రాల ఏర్పాట్లతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి ఉత్సవాల నేపథ్యంలో నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి ఏకంగా రూ.1.07 కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఎంపిక చేసిన కోట జంక్షన్, గంటస్తభం కూడలి, రైల్వే స్టేషన్ జంక్షన్ వంటి ప్రాంతాలలో రోడ్ల మరమ్మతులకు రూ.30 లక్షలు కేటాయించగా..ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్యాచ్‌వర్క్‌లు చేపడుతున్నారు. మరోవైపు పండగ వాతావరణం కోసం ప్రత్యేక లైటింగ్, ఫ్లడ్‌లైట్లు, జంక్షన్‌లలోని విగ్రహాల వద్ద లైటింగ్, రూఫ్ లైటింగ్, లైట్ల మరమ్మతులకు రూ.20లక్షలు వెచ్చిస్తున్నారు. అంటే సాధారణంగా నిర్వహించాల్సిన రోడ్లు, వీధి దీపాలు, నగర సుందరీకరణ పనులు ఉత్సవాల ముందు మాత్రమే హడావుడిగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫౌంటెన్ల మరమ్మతులకు రూ.3.95 లక్షలు, 25 నుంచి 27 వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూ.2.60 లక్షలు కేటాయించారు. ఎల్‌ఈడీ ఆర్చ్ లైటింగ్‌కు రూ.6.21 లక్షలు, 50 డివిజన్లలో గోడలు, గ్రిల్స్‌కు పెయింటింగ్ కోసం రూ.19.32 లక్షలు, రోడ్డు డివైడర్ల పెయింటింగ్‌కు రూ.9.40 లక్షలు కేటాయించారు.
శాశ్వత సౌకర్యాలేవీ?
ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నా..వారి అవసరాలకు తగ్గట్లు శాశ్వత పారిశుధ్యం, తాగునీటి వసతులు కల్పించడంపై దృష్టి ఎంతమేర ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు 16 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారి ఆలయం, కోట జంక్షన్, అయోధ్య మైదానం, ఆనందగజపతి ఆడిటోరియం, గురజాడ కళాభారతి, అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, రాజీవ్ స్టేడియం, ఎల్‌ఐసీ భవనం, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డు, రింగ్‌రోడ్ రైతుబజార్, కొత్తపేట వాటర్ ట్యాంక్, అంబటి సత్రం, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ప్రాంతాల్లో వాటిన ఏర్పాటు చేయనున్నారు.
23 చోట్ల చలివేంద్రాలు
భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో 23 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమ్మవారి ఆలయం, కోట జంక్షన్, అయోధ్యా మైదానం, గంటస్తంభం, గాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్, బాలాజీ వాటర్ ట్యాంక్, కొత్తపేట వాటర్ ట్యాంక్, రాజీవ్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఆనందగజపతి ఆడిటోరియం, ఫ్లవర్ డెకరేషన్ ప్రాంతం, గురజాడ గ్రంథాలయం, సంస్కృత కళాశాల, ఎంఆర్ సంగీత కళాశాల, లేడీస్ రిక్రియేషన్ క్లబ్, కోట లోపల, లక్ష్మీ హోటల్, గణేష్ బేకరీ, ఎస్‌కేఎంఎల్ హోటల్ తదితర ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నారు.
పండగ వస్తేనే పనులా?
నగరంలో రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, తాగునీరు, పారశుధ్యం వంటి మౌలిక వసతుల నిర్వహణ నిరంతరం జరగాల్సి ఉండగా..ప్రధాన ఉత్సవాలు వచ్చినపుడు మాత్రమే కోట్లాది రూపాయల విలువైన పనులను హడావుడిగా చేపట్టడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రూ.30 లక్షలతో రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు చేపడుతుండడంతో పండగ ముగిసిన తర్వాత ఈ మరమ్మతుల పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
నగరానికి పండగ వాతావరణం కల్పించేందుకు లైటింగ్‌తోపాటు రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలి. బి.బాలస్వామి,
విజయనగరం కార్పొరేషన్ కమిషనర్


