ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు... | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు...

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు...

కొత్తవలస: అంగవైకల్యం ప్రతిభకు ఏమాత్రం అడ్డంకి కాదని.. ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ ఇ.కిరణ్‌ అన్నారు. సాధించాలనే సంకల్పం ఉంటే వైకల్యం కూడా విజయానికి మెట్టుగా మారుతుందన్నారు. 2025 టీ 20 అంధుల మహిళా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన సభ్యులను ఆయన అభినందించారు. మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలో గల గురుదేవా చారిటబుల్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవంలో భాగంగా ట్రస్ట్‌ ఆవరణలో 2025 టీ 20 మహిళల అంధుల క్రికెట్‌ విశ్వవిజేతగా నిలిన భారత్‌ జట్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలసి ఆయన ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ.. అంగవైకల్యం అడ్డుకాదని ప్రపంచానికి చాటి చెప్పిన అంధ మహిళా క్రికెటర్లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశంలోని 12 రాష్ట్రాల నుంచి ఎంపికై న అంధ మహిళా క్రికెటర్ల జీవిత గాధలు తెలుసుకుంటే వారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జట్టులోని 16 మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంధుల టీ – 20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విజేత జట్టులో మన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం, వంట్లమామిడి గ్రామానికి చెందిన కరుణకుమారి ఉండడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జట్టు సభ్యులకు ఇంటి స్థలాలు, పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. ముందుగా గురుదేవా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాల తయారీ యూనిట్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్‌ ఆస్పత్రిని పరిశీలించి, సేవలను కొనియాడారు. ట్రస్ట్‌ ఏర్పాటు చేసి 26 సంవత్సరాల్లో 3 లక్షల మందికిపైగా విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు అందజేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ బ్‌లైండ్‌ ఉమెన్‌ క్రికెట్‌ చైర్మన్‌ అజయ్‌రెడ్డి, ట్రస్ట్‌ చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఫణీంద్ర, ట్రస్ట్‌ మెంబర్‌ బీఎన్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ ఇ.కిరణ్‌

టీ 20 క్రికెట్‌ విశ్వవిజేత మహిళా

అంధుల జట్టుకు ఘన సన్మానం

క్రీడాకారులకు నగదు బహుమతులు

అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement