● పెద్దబంటుపల్లిలో 2.52 ఎకరాల భూమి
ఆక్రమణ
● ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నా
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
గుర్ల: ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల చేతిలోకి వెళ్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ బంజరు, రస్తా భూములను చదును చేసి కంచెలు ఏర్పాటు చేస్తున్నా అడ్డుకునే నాథుడే కరువయ్యారని పెద్దబంటుపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెద్దబంటుపల్లిలో సర్వే నంబర్ 2–1లో 0.14 సెంట్లు, 2–2లో 2.38 ఎకరాల బంజరు భూమి ఉంది. ఈ భూమికి పక్కనే వైద్య వృత్తి చేస్తున్న ఓ వ్యక్తికి చెందిన జిరాయితీ భూమి ఉంది. దీంతో ఆ కుటుంబం దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మామిడిమొక్కలు కూడా వేసేశారు. ఇటీవల జరిగిన రీ సర్వేలో ఈ ఆక్రమణ విషయం బయటపడింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే అండదండలు..
పెద్దబంటుపల్లిలోని రెండు ఎకరాల 52 సెంట్ల భూమి ఆక్రమణలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆక్రమించిన ప్రభుత్వ భూమి పెద్దబంటుపల్లి నుంచి గర్భాం వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ కోటీ 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆక్రమణదారుడు కంచె వేసేందుకు వారం రోజులుగా భూమిని చదును చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఆక్రమిత భూమి నుంచి తన జిరా యితీ భూమికి రహదారి సైతం ఏర్పాటు చేసుకున్నారు.


