మెనూ అమల్లో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

మెనూ అమల్లో గందరగోళం

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

మెనూ అమల్లో గందరగోళం

సీతంపేట: గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనాల కోసం ప్రభుత్వం కొత్తగా డైట్‌ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెనూ ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. విశేషమేమిటంటే డైట్‌ చార్జీల పెంపు జీఓలో వారానికి మూడు రోజులు చికెన్‌ పెట్టాలని ఉండగా.. మెనూ చార్ట్‌లో రెండు రోజులే చికెన్‌ పెట్టాలని ఉంది. దీంతో అన్ని వసతిగృహ యాజమాన్యాలు గందరగోళంలో పడ్డారు. 3 నుంచి 10 తరగతులకు ఒకొక్కరికి 45 గ్రాములు చికెన్‌ పెట్టాలి. అలాగే ఇంటర్మీడియట్‌ ఆపై విద్యార్థులకు 50 గ్రాముల చికెన్‌ పెట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ జీఓలోని అనెగ్జర్‌ వన్‌లో వారానికి మూడు సార్లు చికెన్‌ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జీఓకు అనుబందంగా ఇచ్చిన పోస్ట్‌మెట్రిక్‌ మెనూ చార్ట్‌ (అనెగ్జర్‌ –3)ను పరిశీలిస్తే చికెన్‌ వంటకం పాత మెనూ పద్ధతిలోనే ఆదివారం చికెన్‌ బిర్యాని, మంగళవారం రాత్రి చికెన్‌ కర్రీని మెనూలో పొందుపర్చారు. మిగిలిన రోజుల్లో చికెన్‌ వంటకం లేదు. అంటే రెండు రోజులకే పరిమితం చేశారు.

మెనూలో పెద్ద మార్పులేదు

2026 – 27 సంవత్సరానికి కొత్త రేట్లను అమల్లోకి తెచ్చింది. అయితే చార్జీల పెంపుతో పోలిస్తే మెనూలో భారీ మార్పులేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ఉన్న ఆహార పదార్దాలనే కొనసాగిస్తూ.. విద్యార్థుల తరగతుల వారీగా పరిమాణాలు స్పష్టంగా పేర్కొంది. అయితే నామామత్రపు పెంపుతో సరిపెట్టడం గమనార్హం. 2023లో 3–6 తరగతులకు నెలకు రూ.1,150గా ఉన్న డైట్‌ చార్జీని రూ.1,265కు పెంచారు. 7–10 తరగతులకు రూ.1400 నుంచి 1540కు, ఇంటర్‌ ఆపై విద్యార్థులకు రూ.1600ల నుంచి రూ.1760కు పెంచారు. ఈ కొత్త ఉత్తర్వుల్లో బియ్యం, పప్పులు, నూనె, పంచదార, రవ్వలు, కూరగాయలు, ఉప్పు, మసాలా దినుసులు తదితరాల రోజువారీ పరిణామాలను తరగతుల వారీగా నిర్దేశించారు. మూడు నాలుగు తరగతులకు 400ల గ్రాముల బియ్యం, ఐదు నుంచి పది తరగతులకు 500ల గ్రాములు, ఇంటర్‌ ఆపై విద్యార్థులకు 600ల గ్రాములు కేటాయించారు. కూరగాయలు, ఉల్లిపాయలు కూడా వరుసగా 110, 127, 140 గ్రాములుగా పేర్కొన్నారు. గుడ్డు.. చికెన్‌, పండ్లు వారానికి ఆరు రోజులు ఇవ్వాలని నిర్దేశించారు. పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లలోనూ ఇదే తరహా పోషకాహారం ఇవ్వాలి. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు కూడా ప్రత్యేక మెనూ నిర్దేశించారు.

పోస్టుమెట్రిక్‌ హాస్టళ్ల డైట్‌ మెనూలో వైరుధ్యం

వారానికి మూడుసార్లు చికెన్‌ పెట్టాలని ఉత్తర్వు

మెనూ చార్డులో ఆది, మంగళవారాలకే పరిమితం

పెంచిన డైట్‌ చార్జీలతో నెలకొన్న

గందరగోళం

వారానికి మూడుసార్లు అన్నదెక్కడ?

అనెగ్జర్‌ వన్‌లో చికెన్‌కు సంబంధించి వారంలో మూడు రోజులు అని పేర్కొంటూ మూడు నుంచి 10 తరగతి విద్యార్థులకు 45 గ్రాములు, ఇంటర్మీడియట్‌ ఆపై విద్యార్థులకు 50 గ్రాముల పరిమాణాన్ని నిర్దేశించారు. కానీ అనెగ్జర్‌ 3లో వారపు మెనూలో రెండు రోజులు మాత్రమే చికెన్‌ ఉండడంతో మూడోసారి చికెన్‌ ఎప్పుడు ఇవ్వాలి?, ఏ మెనూలో ఇవ్వాలి అన్నది స్పష్టత లేకుండా పోయింది.

చార్జీలు పెంచారు..

మెనూలోనే గందరగోళం

డైట్‌ చార్జీలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల్లో పెంచిన చార్జీలకు అనుగుణంగా మెనూను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఒకే జీఓలో ఒక చోట వారానికి మూడు సార్లు చికెన్‌ అని, మరో చోట రెండు రోజులు మెనూనే చూపించడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement