విజయనగరం క్రైమ్ : విజయనగరం ఉత్సవాలు – 2026ను ప్రజలంతా మెచ్చేలా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పని చేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్థిక ప్రణాళికలు, టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించి వారం రోజుల్లోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణలో, ఆర్థిక విషయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు. జీఎండీఐసీ, మైన్స్, సివిల్ సప్లైస్, ఎకై ్సజ్, డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులు తమ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థలు, వ్యాపార సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి, విజయనగరం ఉత్సవాల నిర్వహణలో వారి భాగస్వామ్యంపై స్పష్టత తీసుకురావాలని సూచించారు. ‘టీమ్ విజయనగరం’ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి సుధాసాగర్, సీపీఓ బాలాజి, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, జిల్లా పర్యాటక అధికారి పి.ఎన్.బి.లక్ష్మీనారాయణ, డీఎస్‌ఓ మురళీనాధ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కరుణాకర్, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, తదితర సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


