కొత్తవలస: భక్తితో పైసా పైసా కూడబెట్టి అమ్మవారికి సమర్పించుకునే భక్తుల నమ్మకాన్ని దేవాదాయశాఖ అదికారులు నిలువునా దోచుకుంటున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులే పక్కా అక్రమాలకు తెరలేపారు. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామం సమీపంలో గల పుణ్యక్షేత్రం ధారపైడితల్లమ్మ అమ్మవారి ఆలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంవారం లక్షల్లో నగదు, బంగారం, వెండి భక్తులు సమర్పిస్తుండగా కేవలం రూ.4వేలు, రూ.5వేలు వస్తున్నాయని కానుకలు సమర్పించిన భక్తులకు రసీదులు కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధార పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి స్థానికంగా ఉండటే గిరిజనులు అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తులు లక్షల్లో కానుకలు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో భక్తులు సమర్పించిన కానుకులకు సరైన లెక్కలు లేకపోవడంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖకు అప్పజెప్పారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అధికారులు ఆది,మంగళవారాల్లో ఉదయం ఆలయం వద్ద హుండీని ఏర్పాటు చేసి సాయంత్రం కొంతమంది భక్తుల మధ్య హుండీలోని కానుకలను లెక్కించేవారు. కాగా రెండు సంవత్సరాల నుంచి అధికారులు ఈ తంతంగాన్ని పక్కన పెట్టి వారే స్వయంగా సంచుల్లో కానుకలను భక్తుల నుంచి స్వీకరించడం మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారంఆలయంలో దేవదాయశాఖ హుండీని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుండీలు ఏర్పాటుచేయకపోగా ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలకు రసీదులు ఇస్తాం. ఆ కానుకులు మా సంచుల్లో వేయండి అంటూ వసూళ్లకు దిగడం గమనార్హం. అయితే భక్తులు సమర్పిస్తున్న కానుకలకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేదు. సంచుల్లో వసూలు చేస్తున్న కానుకలకు, అధికారులు ఇస్తున్న రసీదులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది.
దేవదాయశాఖ అధికారుల్లో కరువైన జవాబుదారీతనం
ధార పైడితల్లమ్మ ఆలయంలో కానరాని హుండీ
నేరుగా భక్తుల నుంచి కానుకలు
స్వీకరిస్తున్న అధికారులు
మా శాఖ అధికారులపై భక్తులు నమ్మకం ఉంచాలి
హుండీని ఏర్పాటు చేస్తే దొంగలు దోచుకుపోతున్నారు. అందుకే వారం వారం మా సిబ్బంది వచ్చి భక్తుల నుంచి నేరుగా సంచుల్లో కానుకలను సేకరిస్తున్నాం. వంద రూపాయలకు పైబడి కానుక ఇచ్చిన భక్తులకు రసీదు ఇస్తున్నాం. భక్తులు, గ్రామస్తులకు మాపై నమ్మకం ఉండాలి.
శ్రీనివాసరావు, ఆలయ ఈఓ
లక్షల్లో దోచుకు పోతున్నారు
ఈ ఆలయానికి వారంలో రెండు రోజుల పాటు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులు సమర్పించిన కానుకులు లక్షల్లోనే ఉంటాయి. అలాగే పలువురు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు సైతం సమర్పించుకుంటున్నారు. అయినా అదికారులు నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో కానుకలను సేకరిస్తూ 30 మందికో 40 మందికో తూతూమంత్రంగా రసీదులు ఇచ్చి మిగిలిన సొమ్ము దోచుకుపోతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలి.
– ఉగ్గిన పద్మనాభస్వామి,
అప్పన్నదొరపాలెం, గ్రామపెద్ద
ఆగ్రహంలో భక్తులు, గ్రామస్తులు
అమ్మవారికికి మేము సమర్పించే కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అధికారుల జేబులు నింపడానికి కాదని భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీని ఏర్పాటు చేయకుండా సంచుల్లో కానుకలను స్వీకరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


