నేడు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నిరసన
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే..
నిరుదోగ్య భృతి, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు తక్షణమే విడుదల చేయాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
విజయనగరం: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యతగా మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్ డిమాండ్ చేశారు. టెట్ వంటి అర్హత పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులకు అన్యాయం చేస్తూ చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీకి సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పోరాటంలో యువత, విద్యార్థులు విజయం సాధించారన్నారు. కేంద్రం దిగివచ్చి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని పేర్కొన్నారు. అదే తరహాలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగభృతి అమలులో మోసం, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో అలసత్వం, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.12 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని న్యూపూర్ణ కూడలి నుంచి మూడులాంతర్ల కూడలి వరకు మంగళవారం శాంతియుత నిరసన ర్యాలీ చేపడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసకారి పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు చెల్లూరి భార్గవ్, మణికంఠ, లెంక నరేష్, తదితరులు పాల్గొన్నారు.


