● నాతవలస కూడలిలో స్వాగతం పలుకుదాం ● పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న జిల్లా మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారని, డెంకాడ మండలం నాతవలస కూడలిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుదామని పార్టీ శ్రేణులకు ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. తన నివాసంలో విజయనగరం నియోజకవర్గ పార్టీ ముఖ్యనాయకులతో సోమవారం సమావేశమైన ఆయన, జగన్ పర్యటన వివరాలపై చర్చించారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు మహిళలకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయాలన్నారు.
టీడీపీ నేతలను నిలదీయండి..
ఎన్నికలకు ముందు అమలుసాధ్యంకాని మామీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండానే అన్నీ అమలు చేశామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న టీడీపీ నేతలను నిలదీయాలని ప్రజలకు కోలగట్ల సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 27 నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో ఇంటికి వచ్చే వారిని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించాలన్నారు. తప్పుడు ప్రచారాలతో గద్దెనెక్కిన వారిని గట్టిగా నిలదీయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, జిల్లా పింఛనర్లు/ ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, అల్లు చాణక్య, బండారు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


