ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకుంటాం

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

విజయనగరం అర్బన్‌:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) వ్యతిరేకించింది. ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్‌ సమావేశ మందింరంలో విజయనగరం జోన్‌ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ కన్వీనర్‌ వై.శ్రీనివాసరావు (ఎన్‌ఎంయూఏ), కో–కన్వీనర్లు జీవీనరసయ్య (ఎంప్లాయీస్‌ యూనియన్‌), సీహెచ్‌ సుందరయ్య (ఎస్‌డబ్ల్యూ), ఎస్‌.వి.శేషగిరిరావు (కేపీ), కేఎస్‌పీరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, భారీ రాయితీలను ప్రైవేట్‌ ఆపరేటర్లకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. ఆ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుని సొంతంగా విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. విద్యుత్‌ బస్సులతో పాటు ఆర్టీసీకి చెందిన అత్యంత విలువైన డిపో స్థలాలను సైతం లీజుల పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది సంస్థను శాశ్వతంగా ప్రైవేటీకరణ వైపు నెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. సీ్త్ర శక్తి పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఉద్యోగులపై భారం పడుతోంది... అయినా సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడం ఉద్యోగులను వంచించడమే అని ఆర్టీసీ జేఏసీ కమిటీ పేర్కొంది.

23వ తేదీ నుంచి నిరసనలు

జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే..

ప్రైవేటు ఆపరేటర్ల విధానాన్ని వీడి, ప్రభుత్వమే నేరుగా విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేయాలి.

సీ్త్ర శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా వెంటనే 4 వేల కొత్త డీజిల్‌ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి.

గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను దృష్టిలో ఉంచుకుని కనీసం 10 వేల మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి.

పెండింగ్‌ డీఏలు, 11వ పీఆర్‌సీ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ డబ్బులతో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి.

సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11నే ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు, ప్రభుత్వానికి వినతి పత్రంతో కూడిన ఉద్యమ కార్యాచరణను అందజేశామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని జోన్లలో సదస్సులు పూర్తి చేసి ఉద్యోగులను సన్నద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే... ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులంతా ఎర్ర రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతారని గేట్‌ ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. సదస్సులో జేఏసీ నాయకులు పి.భానుమూర్తి, కేఎస్‌రావు, బాసూరి కృష్ణమూర్తి (ఈయూ), నర్సింగరావు, ప్రదీప్‌కుమార్‌, బీఎస్‌ రాములు, పీజీరాఫెల్‌ (ఎన్‌ఎంయూఏ), వి.రాములు, సుజాత (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) తదితర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే

కొనుగోలు చేయాలి

విలువైన డిపో స్థలాలను ప్రైవేట్‌

ఆపరేటర్లకు లీజుకిస్తారా?

24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా

నిరసనలు, గేట్‌ ధర్నాలు

విజయనగరం జోన్‌ ఆర్టీసీ జేఏసీ

సదస్సులో నాయకుల హెచ్చరిక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement