రాజుల పాలనలో రాక్షసకాండ | - | Sakshi
Sakshi News home page

రాజుల పాలనలో రాక్షసకాండ

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

పక్క చిత్రంలో పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కనిపిస్తున్నది ఓ గిరిజన కుటుంబం. బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధి డొంగురువలసలోని పోరంబోకు స్థలంలో పూరిపాక వేసుకుని ఎన్నికల కల్యాణ్‌, సీతాలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో 11 ఏళ్లుగా నివసిస్తున్నారు. కల్యాణ్‌ బొబ్బిలి కేంద్రంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తూ వస్తున్నారు. ఇటీవల వీరి ఇంటి సమీపంలో రామమందిరం నిర్మించారు. నిర్మాణ సమయంలో ఆలయానికి ఈ ఇల్లు ఎలాంటి అడ్డంకి కాలేదు. కానీ, ఆ కుటుంబంపై రాజకీయ కక్షగట్టి ఇంటి సమీపంలో చాలా ఇళ్లు ఉన్నా వీరి పూరిగుడిసెను ఖాళీ చేయించాలని అధి కార పార్టీ నాయకులు పూనుకున్నారు. అధికారులకు ఫిర్యాదుచేసి ఒత్తిడి పెంచారు. నోటీసులిప్పించారు. తనకు సరైన గూడు చూపి ఇల్లు ఖాళీ చేయించాలని ఆ కుటుంబం అధికారుల వద్ద ప్రాథేయపడింది. అప్పటివరకు ఖాళీ చేయొద్దంటూ వేడుకుంది. గ్రామ పెద్దల మాటను ధిక్కరించారన్న కారణంతో ఆ గిరిజన కుటుంబాన్ని ఓ వర్గం వెలివేసింది. వారితో ఎవరూ మాట్లాడవద్దని గ్రామ స్తులకు హెచ్చరికలు చేసింది. దీంతో వారిని ఎవరూ పిలవరు.. వారు పిలిచినా ఎవరూ పలుకరు. చివరకు ఆ ఇంటిలో ఉన్న చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రానికి కూడా రానీయడం లేదు. కుటుంబం ఒంటరిగా ఆవేదనతో జీవిస్తోంది. మేమేం పాపం చేశాం. అంతా ఒకటై మమ్మల్ని ఇలా వెలివేస్తారా? మాకు రాజకీయాలు ఆపాదించకండి!.. మమ్మల్ని మా గుడిసెలోనే ఉండనీయాలంటూ ఆ గిరిజన కుటుంబం ప్రాథేయపడుతోంది. విషయం తెలుసుకున్న సామాజిక వేత్తలు, గిరిజన సంఘాల నాయకులు రాజుల పాలనలో సాగుతున్న రాక్షసకాండను దుమ్మెత్తిపోస్తున్నారు. పేద కుటుంబాన్ని వెలివేసేంత తప్పు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.

– బొబ్బిలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement