● గణనీయంగా తగ్గిన ఉపాధి
వేతనదారులు
● గత ఏడాది కంటే 61 వేల మంది
తొలగింపు
● తగ్గిన 19 వేల జాబ్ కార్డులు
విజయనగరం ఫోర్ట్: అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇస్తున్నాం. అడిగిన వెంటనే పని కల్పిస్తున్నామంటూ టీడీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డు ఇచ్చి పని కల్పించినట్లయితే జాబ్ కార్డుల సంఖ్య ఏటా పెరగాల్సి ఉంది. తద్వారా వేతనదారుల సంఖ్య కూడా పెరగాలి. పెరగ డం మాట దేవుడెరుగు చంద్రబాబు ప్రభుత్వంలో జాబ్ కార్డులు, వేతనదారులు గణనీయంగా తగ్గిపోయారు. జాబ్‌కార్డులు, వేతనదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
61 వేల మంది తగ్గిన వేతనదారులు
జాతీయగ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వేలాది మంది వేతనదారులను టీడీపీ సర్కార్ తొలగించేసింది. 2025–26లో జిల్లాలో 3.53 లక్షలు జాబ్ కార్డులు ఉండేవి. 2026–27 నాటికి అందులో 19 వేల జాబ్ కార్డులను తొలిగించేశారు. దీంతో జాబ్ కార్డుల సంఖ్య 3.34 లక్షలకు చేరింది. 2025 –26 లో వేతనదారులు 5.95 లక్షలు ఉండేవారు. 2026–27 నాటికి 61 వేల మంది వేతనదారులను తొలిగించేశారు. దీంతో వేతనదారుల సంఖ్య 5. 34 లక్షలకు చేరింది.
వలసలు వెళ్లారని వేతనదారుల తొలగింపు
బతుకు తెరువు కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని శాశ్వతంగా వెళ్లినట్లు నిర్ధారించి వేతనదారులను, జాబ్ కార్డులను తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలో వేల సంఖ్యలో తొలగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. వేతనదారుల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి పని కల్పించడం ద్వారా వెచ్చించే వ్యయం తగ్గుతుందనే వేతనదారులను తొలగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీడీపీ సర్కార్ హయాంలో ఇబ్బందులే
టీడీపీ సర్కార్ హాయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతున్నట్లు వేతనదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిన వారికే పని కల్పించడం. టీడీపీ నేతలు చెబితే పని ఆపివేయడం వంటివి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో పనిచేసిన మేట్‌లను పూర్తి స్థాయిలో మార్చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను పక్కన బెట్టి టీడీపీ నేతలు సూచించిన వారిని మేట్‌లుగా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబుల్ ఎంట్రీలు తొలిగించాం
శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, మృతి చెందిన వారు, డబుల్ ఎంట్రీ ఉన్న వారి జాబ్ కార్డులు, వేతనదారులను తొలగించాం.
– ఎస్. శారదాదేవి, డ్వామా పీడీ


