విజయనగరం: శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. వరుస మహూర్తాలు వస్తుండడంతో జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభ ముహూర్తాలు..మళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ త్రయోదశి జులై 12 వరకు సుముహూర్తాలు ఉన్నాయని వేద పండితుడు కామేశ్వర శర్మ పేర్కొన్నారు. శుభకార్యాలతో జిల్లా అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలతో పాటు..నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టనున్నారు. పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయం. జూన్ నెలలో 16,17, 19,20,21, 22, 24,25, 26,27, 28 తేదీల్లో జులై నెలలో 1,6,7,9,10, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల ముందే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న వారు ప్రస్తుతం కల్యాణ మంటపాలను మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యారు. బంగారు ఆభరణాలు, కొత్త దుస్తులు ఇతర సామగ్రి కొనుగోలు చేసే వారు వస్తుండడంతో జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి గిరాకీ పెరిగింది.
మంచి ముహూర్తాలు ఉన్నాయి
ఈనెల 16 నుంచి మంచి ముహూరాలు ప్రారంభమవుతున్నాయి. జులై 14 వరకు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లతో పాటు వివిధ శుభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై 14 నుంచి మూఢం ప్రారంభం అవుతుండగా..మళ్లీ శ్రావణం వరకు మంచి రోజులు లేవు.
–పి.కామేశ్వర శర్మ, వేదపండితుడు
ప్రారంభమైన శుభముహూర్తాల సందడి
జులై 12 వరకు అన్నీ మంచి రోజులే


