కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

విజయనగరం: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయతీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు. అటువంటి గ్రామ పంచాయతీలను మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం జిల్లా పరిషత్‌ నిరంతరం ఎన్నో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. తద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మంచి సుపరిపాలన అందించామన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఇంకా మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో, అందుకు అవసరమైన మరిన్ని ప్రణాళికలు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో, గ్రామ పంచాయతీ ద్వారా ఉత్తమమైన సుపరిపాలనను అందిస్తున్న కేరళ రాష్ట్రంలోని అలుప్పుజా జిల్లాలో గల కంజికుజి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాదేశిక సభ్యులతో కలిసి మంగళవారం కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించినట్టు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో జెడ్పీటీసీ సభ్యుల బృందానికి అలుప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులు, డెవలప్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ అశ్విన్‌, పంచాయతీ కార్యదర్శి డీఎఫ్‌ సుభాష్‌, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

పంచాయతీ ప్రజలతో జెడ్పీటీసీల ఆరా

జెడ్పీటీసీ సభ్యుల బృందం తొలుత గ్రామ సందర్శన చేసి, కంజికుజి గ్రామంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పౌర సేవలు, సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంజికుజి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడి పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై గ్రామ పంచాయతీల బలోపేతం గురించి పలు అంశాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంగ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జెడ్పీటీసీల బృందం అధ్యయనం చేసింది.

స్థానిక సంస్థల బలోపేతానికి కృషి

ఈ పర్యటన ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని జెడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమకు మరింత అవగాహన పెంపొందించుకునేందుకు తన సొంత ఖర్చులతో కేరళ టూర్‌ ప్రోగ్రాం నిర్వహించిన జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుకు జెడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అలుప్పుజా జిల్లా కంజికుజి

గ్రామాన్ని సందర్శించిన జెడ్పీటీసీలు

మరింత మెరుగైన సుపరిపాలన

అందించే లక్ష్యంతో పర్యటన

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement