రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 213 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 90 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐటీఐ ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటే జీవితంలో వేగంగా స్థిరపడగలరన్నారు.
బైక్ ఢీ కొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కామాక్షినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై లక్ష్మీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కణపాక ప్రాంతానికి చెందిన కోరాడ శంకరరావు అనే వ్యక్తి ముస్లింల శ్మశాన వాటికకు వెళ్లి తిరిగి వస్తుండగా కామాక్షినగర్ వద్దకు చేరుకునే సరికి ఓ మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్రావుకు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడిపిన వ్యక్తిని ‘ఢిల్లీ డేవిడ్’గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుని బంధువు, కోరాడ అరవింద్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బైక్ నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


