విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల వారికి పింఛన్ అందజేస్తామని చంద్రబాబుతో సహా కూటమి నేతలు ఊరూరా ప్రచారం చేశారు. అధికారం చేజిక్కాక నాలుక మడతపెట్టారు. పింఛన్ల హామీని పక్కనపెట్టేశారు. అర్హుల నుంచి రెండేళ్లుగా దరఖాస్తులు స్వీకరించకుండా, పింఛన్లు మంజూరు చేయకుండా ఏడిపిస్తున్నారు. 50 ఏళ్లవారిని పక్కనపెడితే కనీసం 60 ఏళ్లు నిండిన వారికి, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరించని పరిస్థితి. ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదంటూ లబ్ధిదారులు గోడువెల్లబోస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
ఉత్తుత్తి ప్రచారం..
నమ్మించడం.. మోసం చేయడం టీడీపీ నేతలకు అలవాటైన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. రెండేళ్లుగా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడే జనం నిలదీస్తున్నారు. మీ పాలనకో దండం అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీనిని పక్కదారి పట్టించేందుకు ఈ నెల 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వైబ్‌సైట్ ఓపెన్ అవుతుందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ మాటలు నమ్మిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేసి సచివాలయాలకు పరుగుతీశారు. తీరా అక్కడి సిబ్బంది వెబ్‌సైట్ ఓపెన్ కాలేదని చెప్పడంతో మళ్లీ మోసపోయామని నిట్టూర్చుతూ వెనుదిరుగుతున్నారు.
పింఛన్ కోసం అర్హుల ఎదురుచూపు
ఇంతవరకు కొత్తవి మంజూరు చేయని ప్రభుత్వం
సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం
వెబ్‌సైట్ ఓపెన్ కాలేదన్న సమాధానం
సోషల్ మీడియాలో పింఛన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు బాహాటంగా ఉత్తుత్తి ప్రచారం
ఆరునెలల్లో జిల్లాలో 2,681 మంది
పింఛన్ల కోత
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి (జనవరి, జూలై) అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. 50 ఏళ్లు నిండిన మత్య్సకారులు, గీత, చేనేత కార్మికులకు పింఛన్ అందించేవారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 18 ఏళ్లు దాటిన వితంతవులు, వయసుతో సంబంధం లేకుండా సదరం ధ్రువపత్రాలు ఉన్న దివ్యాంగులకు, 50 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు, డప్పు కళాకారులకు, 19 ఏళ్లు నిండిన ట్రాన్స్‌జెండర్స్‌కు, వయసుతో సంబంధం లేకుండా డయాలసిస్ రోగులకు, డీఎంహెచ్‌ఓకు పింఛన్లు అందించేవారు. అర్హత ఉంటే చాలు ఎవరి ప్రమేయం లేకుండా పింఛన్ మంజూరవుతుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది అర్హుల నుంచి వినిపిస్తున్న మాట.
వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు
కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్ ఇంకా ఓపెన్ కాలేదు.
– శ్రీనివాసపాణి, డీఆర్‌డీఏ పీడీ
విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన బి.సంతోష్‌కు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఏడాది కిందట ఆయన పింఛన్‌కు అర్హుడిగా సదరం సర్టిఫికెట్‌ను వైద్యులు ఇచ్చారు. దానిని పట్టుకుని పింఛన్‌కు దరఖాస్తు చేసేందుకు సచివాలయం, కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌ను సంప్రదించినా ఫలితం శూన్యం. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదన్న సమాధానమే ఉద్యోగుల నుంచి వినిపించింది.
––––––––––––––––––––––––––––
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన డి.నాయుడు అనే వ్యక్తి రెండేళ్ల కిందట మరణించాడు. అతని భార్య వితంతు పింఛన్ కోసం రెండేళ్లుగా సచివాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఆమెకు ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు.


