పార్వతీపురం రూరల్: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పక్కదారి పడుతున్నాయి. పార్వతీపురం పట్టణ, మండల పరిధిలో కొందరు వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్డుదారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఒత్తిడి తెచ్చి సేకరణ
పార్వతీపురం ప్రాంతంలో సుమారు 10 మంది వరకు చిరు వ్యాపారులు కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరుడైన పట్టణ నాయకుడి ప్రమేయం పెరగడంతో ఈ వ్యాపార శైలి మారింది. సేకరించిన బియ్యాన్ని వేరే ఎవరికీ అమ్మకుండా, కేవలం తనకే విక్రయించాలంటూ సదరు వ్యక్తి చిరు వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులతో కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిల్వలు ఇక్కడే..ఒడిశాకు రవాణా
ఈ విధంగా అత్యంత చవకగా (కిలో రూ.20 లోపు) సేకరించిన రేషన్ బియ్యాన్ని స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా గల వివేకానంద కాలనీలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి అనుకూల సమయాల్లో ఆటోల ద్వారా నేరుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడ కిలో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది.
కరువైన తనిఖీలు
గతంలో రెవెన్యూ, విజిలెన్‌న్స్, పోలీస్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుని స్వాధీనం చేసుకునేవారు. నిందితులపై 6–ఎ కింద కేసులు నమోదు చేసేవారు. కానీ, కొద్ది నెలలుగా తనిఖీలు గానీ, కేసుల నమోదు గానీ లేకపోవడంతో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


