● సత్ఫలితాలివ్వని ‘బడిబాట’ ● సర్కారు బడుల్లో ప్రవేశాలు అంతంతమాత్రమే.. ● జిల్లాలో లక్ష్యానికి దూరంగా ప్రవేశాలు ● ఒకటో తరగతి ప్రవేశాల లక్ష్యం 8 వేలు... సాధించినది సగమే! ● రాష్ట్ర సగటు కంటే వెనకడుగు... 17వ స్థానానికి పతనం ● ప్రైవేట్‌ పాఠశాలల హవా... సర్కారు | - | Sakshi
Sakshi News home page

● సత్ఫలితాలివ్వని ‘బడిబాట’ ● సర్కారు బడుల్లో ప్రవేశాలు అంతంతమాత్రమే.. ● జిల్లాలో లక్ష్యానికి దూరంగా ప్రవేశాలు ● ఒకటో తరగతి ప్రవేశాల లక్ష్యం 8 వేలు... సాధించినది సగమే! ● రాష్ట్ర సగటు కంటే వెనకడుగు... 17వ స్థానానికి పతనం ● ప్రైవేట్‌ పాఠశాలల హవా... సర్కారు

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

విజయనగరం అర్బన్‌:

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గత రెండేళ్లుగా దిగజారుతున్నాయి. ఊరిలో బడి ఉన్నా ప్రైవేటు పాఠశాలల వైపే పిల్లలు మొగ్గుచూపుతున్నారు. చదువుతోనే భవిత మారుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు సైతం తాహతకు మించి ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ బడుల్లో బోధనా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా వసతుల కల్పనలో నిర్లక్ష్యం, పాఠశాలల అడ్డగోలు విలీనం వంటివి ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. విద్యాశాఖ ఏటా ఆర్భాటంగా నిర్వహించే ‘బడిబాట’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలివ్వకపోవడం ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతోంది. ఇంటింటి ప్రచారాలు చేసినా ఫలితం లేకపోయిందన్న నిట్టూర్పు కనిపిస్తోంది. చాలా పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు లేకపోవడం పాఠశాలల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.

సర్కారుపై నమ్మకం శూన్యం

ప్రభుత్వ బడుల కంటే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకే తల్లిదండ్రులు జై కొడుతుండడం విద్యాశాఖ అసమర్ధతను ఎత్తిచూపుతోంది. 1100లకు పైగా ఉన్న ప్రభుత్వ అన్ని యాజమాన్యాల బడుల్లో ఒకటో తరగతిలో చేరిన వారు 36.47 శాతంతో 5,912 మంది... అయితే కేవలం 302 సంఖ్యలో ఒకటో తరగతి ఉన్న ప్రైవేటు బడుల్లో ఏకంగా 63.53 శాతంతో 8,759 మంది చేరారు. గడిచిన మూడేళ్లలో పరిశీస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతూ, ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 2024–25 విద్యాసంవత్సరలో 7,438 మంది ఉంటే మరుచటి 2025–26 విద్యాసంవత్సరానికి 359 మంది తగ్గుతూ 7,079 మంది, 2026–27 సంవత్సరానికి ఏకంగా 1,167 మంది తగ్గుతూ కేవలం 5,912 మంది మాత్రమే నమోదయ్యారు.

వైఫల్యానికి కారణాలు ఎన్నో....

ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంగ్ల మాధ్యమం ఇప్పడు నడుస్తున్నా... దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, పర్యవేక్షణ లేకపోవడం, పుస్తకాలు, విద్యార్థి కిట్‌లు సకాలంలో అందకపోవడం, పాఠశాలల విలీనంతో ప్రయాణ సదుపాయాలు లేకపోవడం, ఉపాధాయులను వివిధ యాప్‌లు, సర్వేలలో నిమగ్నం చేసి బోధనకు దూరం చేయడం వంటివి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తగ్గేందుకు కారణంగా కనిపిస్తున్నాయి.

17వ స్థానానికి పతనం

రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలో విజయనగరం జిల్లా 17వ స్థానానికి పడిపోయి అట్టడుగున కొట్టుమిట్టాడుతోంది. ఒకటో తరగతి ప్రవేశాల రాష్ట్ర సగటు 39.12 శాతం కాగా జిల్లా కేవలం 36.47 శాతానికి పరిమితమై రాష్ట్ర సగటున కూడా అందుకోలేకపోయింది. లక్ష్య సాధనలో రాష్ట్ర సగటు 71.12 శాతం ఉంటే మన జిల్లాలో 66.31 శాతంతో వెనుకబడి ఉంది. పొరుగున ఉన్న పోలవరం (80.21 శాతం), ఏఎస్‌ఆర్‌ (71.09 శాతం) జిల్లాలో ప్రవేశాల సగటు బాగుంది.

లక్ష్యం

8 వేలు... చేరికలు

సగమే..

జిల్లాలో ఒకటో తరగతిలో చేరే వయస్సు (5 ఏళ్లు దాటాలి) గల పిల్లలు 16,211 మంది ఉన్నారు. అందులో కనీసం 55 శాతం 8,916 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్చాలని విద్యాశాఖ కనీస లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 11 నాటికి చేరిన వారు కేవలం 5,912 మంది మాత్రమే. ప్రవేశాలకు ఆసక్తి చూపిన వారిలో చాలా మంది మళ్లీ ప్రైవేటు బడులవైపు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటికి రావడంతో పేరిచ్చామని, పిల్లలను ప్రైవేటు బడికే పంపిస్తామంటూ కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement