శృంగవరపుకోట: పట్టణ ప్రజల కొంగుబంగారం ధారగంగమ్మ అమ్మవారి జాతర ఆదా యం రూ.5,80,741లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి జాతర ఆదాయా న్ని శుక్రవారం లెక్కించారు. మూడు రోజుల పాటు జరిగిన జాతరలో దర్శన టికెట్ల విక్రయంతో రూ.2,11,511లు, హుండీల నుంచి రూ. 3,69,230 సమకూరిందన్నారు. రెండేళ్ల కిందట 2024 నాటి జాతరలో టికెట్ల అమ్మకాల వల్ల రూ.1,99,841, హుండీల ఆదాయం రూ. 3,11,767 వచ్చినట్టు చెప్పారు. ఈ సారి టికెట్ల వల్ల రూ.16,670, హుండీల ఆదాయం రూ. 57,463 పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ కె.నాగేంద్ర, సీఐ శ్యాంప్రసాద్, అర్చకుడు రాజగోపాలాచార్యులు, శ్రీవారి సేవకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బీఎల్‌ఓలకు కిట్ల పంపిణీ
విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్లిష్ట సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్‌ఓ) అందజేసే ప్రత్యేక కిట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి శుక్రవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓవర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ప్రతి ఇంటినీ సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో వారికి ఉపయోగపడేలా అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 మంది బీఎల్‌ఓలకు ఈ కిట్లను తక్షణమే పంపిణీ చేయాలని కలెక్టర్ డీఆర్‌ఓకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సత్తిబాబు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.
స్కానింగ్ రిపోర్టులను ఆన్‌లైన్ చేయాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్‌చేసిన ప్రతి కేసు వివరాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు స్కాన్ సెంటర్లు ఎవరైనా కొత్తగా మిషన్లు కొనుగోలుచేసినా, తొలగించినా వాటి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. పీసీపీఎన్‌డీటీ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ కె.రాణి, ఆర్డీఓ సుధాసాగర్, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు.
మహానాడులో చిందేసిన ఆరోగ్యశ్రీ ఉద్యోగి
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ.. కొందరు ఉద్యోగులు అధికార టీడీపీ సేవలో తరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, నాయకులతో కలిసి చిందేయడం వివాదాస్పదంగా మారింది. ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ)లో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న ఆర్.ఎం.నాయుడు బొండపల్లి మండలం దేవుపల్లిలో గురువారం నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. తప్పెడుగుళ్లు కళాకారుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్టెప్పువేయగా... టీమ్‌లీడర్ విజిల్ వేస్తూ చిందేశారు. ట్రస్టు ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొడమే తప్పని, ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.


