● అర్బన్ తహసీల్దార్ ఏర్పాటుకు శ్రీకారం
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే
గజిట్ నోట్
● పట్టణవాసులకు ప్రయోజనకరం
13 రెవెన్యూ గ్రామాలతో గ్రామీణ మండలం
13 రెవెన్యూ గ్రామాలతో గ్రామీణ మండలంగా ఏర్పాటుకానుంది. గ్రామీణ మండల పరిధిలో గుంకలాం, ద్వారపూడి, కొండకరకాం, సిరియాలపేట, రాకోడు, పినవేమలి, కోరుకొండ, సారిక, జొన్నవలస (జగన్నాథపురం), దుప్పాడ, చెలువూరు, నారాయణపురం, మలిచర్ల గ్రామాలను చేర్చారు. విజయనగరం గ్రామీణ మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.కూర్మనాథరావు అర్బన్ మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వ్యవహరించనున్నారు. ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ తెలియాల్సి ఉంది.
విజయనగరం రూరల్:
జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైన విజయనగరం వాసులకు రెవెన్యూ సేవలు సులభతరం కానున్నాయి. అర్బన్, గ్రామీణ మండలాలుగా మారుస్తూ కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి గజిట్ నోట్ విడుదల చేశారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రారంభంకానుంది. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయం బూర్లెపేటలో ప్రస్తుతం ఉన్న చోటనే యథావిధిగా కొనసాగనుంది.
● గత ప్రభుత్వ హయాంలోనే...
ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే సదుద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు మెరుగైన, త్వరిగతిన రెవెన్యూ సేవలు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాలో అర్బన్ మండలాల ఏర్పాటుకు 2023 ఫిబ్రవరి నెలలో శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో అర్బన్ మండలాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విజయనగరం అర్బన్ మండలంగా 2023 మే 8న ఆఖరి గజిట్‌నోట్ (జీఓ నంబర్ 210) జారీచేసి విజయనగరం అర్బన్ మండలంగా ప్రకటించింది. ఏడాదిలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు ఆలస్యమైంది. అయితే, ఎట్టకేలకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు కలెక్టర్ గజిట్ జారీ చేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
4.5 లక్షల జనాభాకు ఒకటే తహశీల్దార్ కార్యాలయం
విజయనగరం నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్, విజయనగరం గ్రామీణ మండలం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉన్న 50 వార్డు సచివాలయాల పరిధిలో 2.88 జనాభా ఉండగా, విజయనగరం మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 43,599 మంది జనాభా నివసిస్తున్నారు. నియోజకవర్గం విస్తీర్ణం 29,226.69 హెక్టార్లలో విస్తరించి ఉంది. మెట్టభూమి విస్తీర్ణం 10,874.81 హెక్టార్లు కాగా, పల్లం భూమి విస్తీర్ణం 7,954.44 హెక్టార్లు. తెలుపు రేషన్‌కార్డుదారులు సుమారు 80 వేల మంది ఉండగా, వీరిలో అర్బన్ పరిధిలోనే సుమారు 60 వేల మంది ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో 2,61,133 ఓటర్లు ఉండగా గ్రామీణం మండలంలో 37,732 మంది, కార్పొరేషన్ పరిధిలో 2,23,401 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం అంతటికీ ఒకటే తహసీల్దార్ కార్యాలయం ఉండటంతో ఇన్నాళ్లూ సేవల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎట్టకేలకు విజయనగరం కార్పొరేషన్‌తో పాటు, హజీసాహెబ్‌పేటతో అర్బన్ మండలంగా ఏర్పాటు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు కానుండడంతో ధ్రువపత్రాల మంజూరు వేగవంతంతో పాటు రెవెన్యూ సమస్యలు త్వరతగతిని పరిష్కారానికి ఆస్కారం కలగనుంది.


