ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధిచెబుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధిచెబుదాం

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

విజయనగరం గంటస్తంభం: ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గ పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన మే డే వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం పోరాట స్ఫూర్తితో సాగాయి. చికాగో వీధుల్లో ఎనిమిది గంటల పనిదినం సాధన కోసం కార్మికులు చిందించిన రక్తపు చుక్కలను స్మరించుకుంటూ, నేటి తరపు శ్రామిక వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తింది. ఉదయం నుంచే నగరంలో ఎర్రజెండాలు రెపరెపలాడుతూ కార్మిక ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాయి. సీఐటీయూ, సీపీఐ, సీపీఎం, ఏఐసీసీటీయు, సీపీఐ లిబరేషన్‌ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు, కూలీలు వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. చేతుల్లో ఎర్రజెండాలు, నోట నినాదాలతో కార్మిక హక్కుల కోసం పోరాట సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని హక్కు కాపాడాలి, కాంట్రాక్ట్‌ విధానాలను రద్దు చేయాలి, కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించాల, కనీస వేతనం అందజేయాలంటూ నినదించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధిచెబుతామని స్పష్టంచేశారు. నగరంలోని బొంకులదిబ్బ నుంచి ప్రారంభమైన కార్మికుల ప్రదర్మన గంటస్తంభం మీదుగా కోట కూడలి వరకు సాగింది. ఆటో కార్మికులు, ముఠా వర్కర్లు, భవన నిర్మాణ శ్రామికులు, మున్సిపల్‌ కార్మికులు దారిపొడువునా కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి అంటూ చేసిన నినదించారు.

● కోట కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ, కార్మికుల శ్రమను కారుచౌకగా ధారాదత్తం చేస్తోందని ధ్వజమెత్తారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కొమ్ముకాసేలా 4 లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా, స్కీమ్‌ వర్కర్లకు నామమాత్రపు జీతాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు.

● పైడి రాజమ్మ సామాజిక భవనంలో ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు బొడ్డు వాసుదేవరావు మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా, భద్రత లేని వెట్టిచాకిరీ చెయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్మి బుగత అశోక్‌, ఎం.రాజు, బి.శంకరరావు పాల్గొన్నారు.

● పసిబిడ్డల అలనాపాలనా చూసే అంగన్‌వాడీలకు ఇచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఐషా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

● సీఐటీయూ నగర కార్యదర్మి బి.రమణ ఎస్‌బ్ల్యూసీ మార్కెట్‌ వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడులు చేస్తూ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు పోరాడాలని పిలుపునిచ్చారు.

● సీపీఎం నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు డాబా తోటలో జెండా ఆవిష్కరించారు. మే డే స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

● సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు యు.ఎన్‌.రవికుమార్‌ మాట్లాడుతూ, కార్మిక చట్టాలు ఎవరి దయాదక్షిణ్యాల వల్ల వచ్చినవి కావని, రక్తం చిందించి సాధించుకున్నవని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement