● తమ్ముడి పెళ్లికి వచ్చి అన్న మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రాజాం/సంతకవిటి:
సంతకవిటి మండలం మిర్తివలస గ్రామంలో పెళ్లింట విషాదం అలుముకుంది. తమ్ముడి పెళ్లి కోసం పదిరోజుల ముందే వచ్చి పనుల్లో నిమగ్నమైన యువకుడిని మృత్యువు విద్యుత్‌షాక్ రూపంలో కాటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లిబాజా మోగాల్సిన ఇంటిలో చావుగంట మోగింది. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్తివలస గ్రామానికి చెందిన పొన్నాడ రమణారావు, పుష్పలత దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు దీపక్‌కుమార్ వివాహం శుక్రవారం రాత్రి జరగాల్సి ఉంది. దీనికోసం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న రెండో కుమారుడు సతీష్ (32) పదిరోజుల కిందట భార్యతో కలిసి మిర్తివలస వచ్చాడు. తమ్ముడి పెళ్లి పనుల్లో బిజీ అయ్యాడు. ఉదయం వంటలు చేయించడం కోసం శుక్రవారం వేకువజామున 4 గంటలకు డాబా మీద ఇంట్లో స్నానానికి వెళ్లాడు. ఎంత సమయానికి భర్త రాకపోవడంతో భార్య మౌనిక డాబా ఎక్కిచూసింది. ఇంటికి అలంకరించి ఉన్న సీరియల్‌సెట్ తీగలకు తగిలి భర్త పడిపోయినట్లు గుర్తించి కేకలు వేసింది. ఇంతలో కుటుంబ సభ్యులందరూ డాబా మీదకు వెళ్లి చూడగా సతీష్ విద్యుత్‌షాక్‌కు గురైనట్లు గుర్తించారు. ప్రైవేటు వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తో అటు సతీష్ ఇంటితో పాటు మిర్తివలస గ్రామంలో విషాదం అలుముకుంది. పెళ్లి జరగాల్సిన ఇంటిలో చావుమేళం మోగిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. మృతునికి ఎనిమిది నెలల కిందటే పెళ్లి జరిగింది. తమ్ముడి పెళ్లిపనుల్లో ముందుండే సతీష్ అనంతలోకాలకు వెళ్లిపోయిన ఘటనను కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న సంతకవిటి ఎస్‌ఐ గోపాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేశారు.
రెండు నెలలు వ్యవధిలో ఆరు మరణాలు
మిర్తివలసలో విషాదచాయలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో గ్రామానికి ఏమైందన్న మాట వినిపిస్తోంది. రెండు నెలలు వ్యవధిలో ఓ చిన్న గ్రామంలో ఆరు మరణాలు సంభవించడం గ్రామస్తులను కలచివేస్తోంది. సతీష్ మృతిచెందిన ఒకరోజు ముందే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కూన మల్లేశు (31) ఏప్రిల్ 30న ఒంగోలులో రైలు దిగుతూ ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఆయన మృతదేహం ఇంకా గ్రామానికి చేరలేదు. ఆయనకు భార్య సుమశ్రీ, తల్లిదండ్రులు సత్యవతి, ఆనందరావు ఉన్నారు. వారంరోజుల కిందట గ్రామానికి చెందిన మీసాల చంద్రరావు(55), అప్పటికి పదిరోజులు ముందు కూన బాబూరావు(30), మరో 25 రోజుల ముందు అరసాడ విజయలక్ష్మి(60), అరసాడ వెంకటరావు(65)లు అనే భార్యభర్తలు మృతిచెందారు. కొందరు అనారోగ్యంతో, యువకులు ప్రమాదాల రూపంలో మృతిచెందడం గ్రామస్తుల్లో విషాదం నింపింది.


