రామభద్రపురం: ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ఫేస్ అంథెంటికేషన్ నిబంధన కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఈ–కేవైసీ పెండింగ్ వంటి కారణాలతో కూలీలకు హాజరు పడడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వేసవి సీజన్‌లో ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 6,26,094 మంది వేతనదారులు ఉండగా రోజుకు సుమారు 1.70 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వారికి ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కూలీల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాకకపోవడం, సర్వర్ సమస్యల కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.కొన్ని గ్రామాల్లో పనులు చేయక ముందే ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు నమోదు చేస్తుండగా వారి వివరాలతో పాటు ముఖ గుర్తింపు నమోదైన వారు పనులు చేస్తున్నారు.నమోదు కాని వారు మొర్రో అంటూ కిలోమీటర్లు నడిచి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అలాగే మరి కొన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయే ముందు ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్‌లు ముఖ గుర్తింపు, వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాని కూలీలు ఆ రోజు వేతనం నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ ఆథెంటికేషన్ సమస్యతో కళ్లు,వేలి ముద్రలు, ఆధార్ మిస్‌మ్యాచ్ సమస్యతో యాప్ గుర్తించకపోవడం, ఫేస్ మ్యాచ్ కాకపోవడంతో హాజరు పడడం లేదని కూలీలు చెబుతున్నారు. పని ప్రదేశంలో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో ఫొటోలు తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని క్షేత్ర స్థాయి సిబ్బంది అంటున్నారు.
వేతనదారుల ఆకలికేకలు..
ఉపాధి హామీ శ్రామికులు ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే బతుకు బండిని నెట్టాలి.అయితే వారి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు ఏకంగా నాలుగు నెలలుగా కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. వారు చేసిన పనులకు గానూ జిల్లాలో దాదాపు రూ.24 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా..ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉపాధి వేతనాలు అందక వేతనదారులు నానా అగచాట్లు పడుతున్నారు.నాలుగు నెలలకు సంబధించిన ఉపాధి కూలి ఖాతాల్లో జమకాకపోవడంతో కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు తల్లడితున్నాయి.
ఫేస్ ఆథెంటికేషన్‌కు సాంకేతిక సమస్య
పడిగాపులు కాస్తున్న కూలీలు
కానరాని వేసవి భత్యం
నాలుగు నెలలుగా అందని వేతనాలు
వేతనదారుల వేదన
ఆగిన వేసవి భత్యం..
వేసవిలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో శ్రామికులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో భత్యం అందిస్తూ వస్తున్నాయి.ఉపాధిహామీ పథకంలో ఏటా వేసవి భత్యాన్ని ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు నెల వారీగా పెంచి అందించే వారు. చేసిన పనికి తగ్గట్లు 15 నుంచి 30 శాతం వరకు అదనపు భత్యం లభించేది. వేతనదారులకు ఒక్కొక్కరికి రోజువారీ రూ.200 వస్తే వేసవి భత్యం 30 శాతం కలిపి రూ.260 వారి ఖాతాలకు వారి ఖాతాలకు జమచేసేవారు. అయిటే కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి భత్యం అందించకపోవడంతో శ్రామికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.అలాగే వారి జీవనంపై అదనపు భారం పడుతోంది. ఇప్పటి నుంచైనా వేసవి భత్యం ఇవ్వాలని వేతనదారులు కోరుతున్నారు.
వయసు పైబడిన వారితో ఇబ్బంది
సాంకేతిక సమస్య కారణంగా వయసు పైబడిన కూలీలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. కళ్లు, వేలిముద్రలు గుర్తించకపోవడం,ఫేస్ మ్యాచ్ కాకపోవడం జరుగుతోంది. అలాంటి వారికి కొంత ఇబ్బందైనా నష్టం కలగకుండా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి హాజరు పడేలా చూస్తున్నాం. వేతనదారులు నష్టపోకుండా కూలి డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం.
ఎస్ శారదా దేవి,ఉపాధిహామీ పీడీ


