● రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
● గ్రామస్తుల కంటకన్నీరు
రామభద్రపురం: గ్రామంలోని పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తూ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. మంచి మాస్టారును కోల్పోయామని, హఠాత్తుగా విషాద వార్త వినాల్సి వస్తుందను కోలేదని గ్రామంలోని ప్రజలు, చిన్నారులు, తల్లిదండ్రులు వాపోయారు. రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణు మాస్టారు గురువారం పార్వతీపురం మండలంలోని బంధువుల ఇంట పెళ్లికి ద్విచక్రవాహనంపై వెళ్తూ వెంకంపేట పంచాయతీ వైకేఎంనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మూడేళ్ల పాటు టీచర్‌గా పనిచేసిన ఆయన గ్రామంలోని అందరిలో కుటుంబసభ్యుడిగా కలిసిపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ మంచి మాస్టారుగా పేరు పొందారు.హెచ్‌ఎం అకాల మరణం అందరినీ కలిచివేసింది. శుక్రవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం, గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామప్రజలు, తల్లిదండ్రులు,విద్యార్థులు మాస్టారు మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించడంతో పాటు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఎంఈవో తిరుమలప్రసాద్, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం జేసీ రాజులు వేణు మాస్టారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.


