● రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ
● వేడుకగా మే డే వేడుకలు
విజయనగరం టౌన్: అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక న్యూపూర్ణ జంక్షన్ వద్ద శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్‌టీయూ (న్యూ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే దళారీ బూర్జువా వర్గంగా వ్యవహరిస్తున్న పాలకులు దోపిడీ విధానాలకు వంతపాడుతూ దేశంలోనే రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి తగినట్లుగా చట్టాలను మారుస్తున్నారన్నారు. దేశంలో ఉన్న కుల,మత, వర్గ వ్యత్యాసాలను ఉపయోగించుకుని ప్రజలను విభజించేందుకు, ప్రధాన సమస్యలను ఆలోచించకుండా ఉండేందుకు టెర్రరిజం, మైనారిటీ, రిజర్వేషన్‌ల పేరుతో అల్లర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కంపెనీ యాజమాన్యాలకు అణిగిమణిగి ఉండేలా, వారి హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లు ముఖ్యంగా యూనియన్‌లను లేకుండా చేసేందుకు, నాయకుల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవన్నారు. శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ రారేడో, ఊబర్ వంటి యాప్స్ వచ్చి ఆటో కార్మికుల పొట్టకొడుతున్నాయని, ఉచిత బస్సు పథకం ఏకంగా కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. యూనియన్ కార్యదర్శి రెడ్డి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పీడీఎస్‌ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.విశ్వనాథ్, రజక సంఘం నాయకులు కె.సతీష్, చిన్న, అప్పలరాజు, ఎన్‌వైఎస్ జిల్లా కన్వీనర్ సీహెచ్. ధర్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


