స్వీయ గణనపై అవగాహనకు 5 కె రన్‌ | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనపై అవగాహనకు 5 కె రన్‌

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

స్వీయ గణనపై అవగాహనకు 5 కె రన్‌

విజయనగరం అర్బన్‌: ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5 కె రన్‌ను కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి స్థానిక శ్రీపైడితల్లి అమ్మవారి గుడి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి కచ్చితమైన గణాంకాలు అందుతాయని, ఆ గణాంకాల ఆధారంగా అభివృద్ధి పథకాలను సమర్ధవంతంగా అమలు చేయగలుగుతామని చెప్పారు. డిజిటల్‌ విధానాన్ని వినియోగించి సులభంగా స్వీయ లెక్కింపులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విధానం సమయం ఆదా చేయడంతో పాటు పారదర్శకతను పెంచుతుందన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో అధికారులు, వాలంటీర్లు ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని ఈ ప్రక్రియలో ఎవరూ దూరం కాకుండా చూడాలని సూచించారు. సరిగ్గా నమోదు చేసిన సమాచారం భవిష్యత్తులో సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం కీలకమని పేర్కొన్నారు. ర్యాలీ గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి గుడి 4, ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌, వైఎస్సార్‌ కూడలి, రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా కోట వరకు సాగింది. కోట వద్ద జరిగిన సభలో డీఆర్‌ఓ సత్తిబాబు మాట్లాడుతూ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణనలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన, మే 1 నుంచి 31 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజల సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఓ బాలాజీ, ఆర్డీఓ సాగర్‌, డీఎస్‌డీఓ వెంకటేశ్వరరావు, డీఈఓ మాణిక్యం నాయుడు, మార్క్‌ఫెడ్‌ డీఎం ఎంకటేశ్వరరావు తదితర జిల్లా అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement